సమితిలు రైతుల కోసమే రాజకీయాల కోసం కాదు: కెసిఆర్

February 26, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న రాజేంద్రనగర్ లోని జయశంకర్ విశ్వవిద్యాలయంలో తెలంగాణా రైతు సమన్వయ సమితుల సభ్యులతో సమావేశమైనప్పుడు, వాటిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా జవాబిచ్చారు. 

రాజకీయ లబ్ది కోసం ఏర్పాటు చేసినవి కావు:

“ఈ సమితిలు రాజకీయ లబ్ది కోసం ఏర్పాటు చేసినవి కావు. రైతుల స్వయంసంవృద్ది సాధించేందుకు ఏర్పాటు చేసినవి. అవి రైతులకు సంబంధించిన ప్రతీ విషయాన్ని స్వయంగా పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించుకొనేవిధంగా బలోపేతం చేస్తాము. అందుకోసం రూ.200 కోట్లు మూలధనం సమకూరుస్తాము. వీటిలో సభ్యులు తరచూ సమావేశమయ్యి తమ సమస్యలను చర్చించుకొనేందుకు ప్రతీ ఏఈఓ పరిధిలో ఒకటి చొప్పున రైతు వేదికలు నిర్మిస్తాము. రూ.12 లక్షలతో నిర్మించబోయే ఈ భవనాలను ఏర్పాటు చేస్తాము. వ్యవసాయ మార్కెట్లలో ఈ తెలంగాణా రైతు సమన్వయ సమితికి ఒక గదిని   ఒక కంప్యూటర్ వగైరా అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. రానున్న రోజులలో రాష్ట్రంలో రైతులే తమ పంటలకు ధరలు నిర్ణయించుకొనే విధంగా చేస్తాము. ఈ సమితిలు రైతుల కోసమే తప్ప రాజకీయాల కోసం ఏర్పాటు చేసింది కాదు కనుక ఇవి నేను బ్రతికి ఉన్నంతకాలం కొనసాగుతాయి,” అన్నారు కెసిఆర్.      

24 గంటలూ కరెంటు కొనసాగిస్తాం:

 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరా చేస్తుండటంవలన రైతులు విచ్చలవిడిగా నీళ్ళు తోడేస్తునందున భూగర్భజలాలు స్థాయి వేగంగా పడిపోతాయనే ప్రతిపక్షాల వాదనలు సిఎం కెసిఆర్ ఖండించారు. “పంటలకు ఎంత నీరు పెట్టాలనే విషయం మన రైతులకు బాగా తెలుసు. వారిపై నాకు పూర్తి నమ్మకముంది. కనుక 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరాను కుదించే ప్రసక్తే లేదు. రైతులందరూ చాలా పొదుపుగా భూగర్భజలాలను వాడుకొంటూ ఏడాది మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అన్నారు సిఎం కెసిఆర్.

పంటపెట్టుబడి: 

రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఎకరానికి రూ.4,000 పంటపెట్టుబడిగా అందించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో రూ.12,000 కోట్లు కేటాయించబోతున్నాము. ఇక ఈ ఖరీఫ్ సీజన్ పంటపెట్టుబడి కోసం మే నెల నుంచి అన్ని గ్రామాలలో చెక్కుల రూపంలో అందిస్తాము. వచ్చే రబీ పంట నుంచి ప్రీ-లోడెడ్ కార్డులను రైతులకు అందజేస్తాము,” అని చెప్పారు కెసిఆర్.


Related Post