2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ జనసేనను పార్టీని స్థాపించడంతో, మెగా ఫ్యామిలీలో, మెగా బ్రదర్స్ మద్య, మెగా అభిమానుల మద్య చిచ్చు రగిలింది. అప్పుడు నాగబాబు, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ చిరంజీవికే మద్దతు ఇచ్చారు. చిరంజీవి తన తండ్రి కనుక రామ్ చరణ్ ఆయనకే మద్దతు పలకడం సహజం. చిరంజీవి వలననే నాగబాబుకు సినీ ఇండస్ట్రీలో అవకాశం, గుర్తింపు వచ్చింది కనుక అన్నకు మద్దతు పలుకడం సహజమే. అయితే అంతటితో ఆగకుండా వారిరువురూ మెగా అభిమానులలో చీలికలు సృష్టించి చిరంజీవికి మద్దతు కూడగట్టేందుకే గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ కారణంగా మెగా అభిమానులలో చాలా అయోమయం ఏర్పడింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వారిని పల్లెత్తు మాటనలేదు. ఆ తరువాత కధ అంతా అందరికీ తెలిసిందే.
ఏడాదిలో మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. తన కుటుంబ సభ్యుల మద్దతు కోరబోనని, తనకు ఎవరి మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మాట చెప్పిన రోజునే అబ్బాయ్ రామ్ చరణ్ తేజ్ బాబాయ్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయడం విశేషం. వచ్చే ఎన్నికలలో చిరంజీవి పోటీ చేయరని, కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవాలనుకొంటున్నారని వార్తలు వస్తున్నాయి. బాబాయ్ కి అబ్బాయ్ మద్దతు ప్రకటించడం చూస్తే ఆ వార్తలు నిజమేనని నమ్మవలసివస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో చిరంజీవి పోటీ చేయదలిస్తే లేదా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయదలిచినా రామ్ చరణ్ బాబాయ్ కి ఈవిధంగా మద్దతు పలికి ఉండరు కదా! చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు ఇచ్చి అన్న తరపున గట్టిగా ఎన్నికల ప్రచారం చేశారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు తమ్ముడికి ఎవరూ సహాయం చేయలేదు పైగా అడుగడుగునా అడ్డుపడ్డారు కూడా. అవసరమైనప్పుడు ఎవరూ మద్దతు పలుకలేదు. ఇప్పుడు వద్దంటే మద్దతు ఇస్తామంటున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యుల వ్యక్తిత్వాలలో ఎంత వ్యత్యసముందో అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు!