కోమటిరెడ్డి ఎందుకు వెనక్కు తగ్గారో?

January 09, 2018


img

సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఆకస్మికమార్పు వచ్చింది. తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, అయనను తక్షణం ఆ పదవిలో నుంచి తప్పించి ఆ పదవి తనకు ఇవ్వకపోతే ‘వేరే దారి’ చూసుకొంటామని హెచ్చరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న సిఎల్పి కార్యాలయంలో మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ, “అవును!నేను పిసిసి అధ్యక్ష పదవిని ఆశించిన మాట వాస్తవమే. కానీ అదిప్పుడు ముగిసిన అధ్యాయం. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను అన్నివిధాల సహకరిస్తాను. టి-కాంగ్రెస్ లో మా వంటి సీనియర్ నేతలు చాలా మంది ఉన్నాము. అందరం ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేస్తాము. ఒక్కొక్కరూ కొన్ని నియోజకవర్గాల బాధ్యత తీసుకొని వచ్చే ఎన్నికలలో వాటిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తాము. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మా పార్టీకి కనీసం 70-80 సీట్లు తప్పకుండా వస్తాయి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేస్తాను,” అని అన్నారు. 

కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా హెచ్చరించినందునే కోమటిరెడ్డిలో ఈ ఆకస్మిక మార్పు వచ్చి ఉండవచ్చు. అయన కాంగ్రెస్ పార్టీపై అలిగి తెరాస లేదా మరో పార్టీలోకి లోకి వెళ్ళాలనుకొన్నా వాటిలో ఇమడటం కష్టమే. ఈ విషయం అయన కూడా గ్రహించినట్లే ఉన్నారు. బహుశః అందుకే పార్టీ మారే ఆలోచనను విరమించుకొన్నట్లున్నారు. పిసిసి అధ్యక్షుడిపైనే విమర్శలు గుప్పిస్తూ,  ఇంత కాలం సవాలు విసిరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డే అందరికంటే ముందుగా ఇంత సానుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. మిగిలిన సీనియర్ నేతలు కూడా     ఇదేవిధంగా ఆలోచించి పార్టీని గెలిపించుకొంటేనే తమకు పదవులు, అధికారం లభిస్తాయని గ్రహిస్తే వచ్చే ఎన్నికలలో వారు తెరాసకు గట్టి సవాలు విసరడం ఖాయం.


Related Post