బతుకమ్మ పండగకి అందరూ సిద్దమేనా?

September 11, 2025
img

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ముఖ్యంగా మహిళల జీవనశైలి వారి మనోభావాలకు అద్దం పట్టే పండుగలలో బతుకమ్మ పండగ ప్రధానమైనది.

తొమ్మిదిరోజులు పాటు సాగే ఈ పూల పండగ ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కాబోతోంది.

ఈనెల 22న అతుకుల బతుకమ్మ, 23న ముద్దపప్పు బతుకమ్మ, 24న సన్నబియ్యం బతుకమ్మ, 25న అట్ల బతుకమ్మ, 26న అలిగిన బతుకమ్మ, 27న వేపకాయల బతుకమ్మ, 28న వెన్న ముద్దల బతుకమ్మ, చివరిగా సెప్టెంబర్‌ 30న దసరా పండగ రోజున సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ఈ తొమ్మిది రోజుల పూల పండగ ముగుస్తుంది.

బతుకమ్మ పండగ సందర్భంగా ఈసారి జీహెచ్ఎంసీ హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 52 అడుగుల ఎత్తైన బతుకమ్మని ఏర్పాటు చేసి 10,000 మంది మహిళలతో బతుకమ్మ ఆట పాటలు నిర్వహించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సాధించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. 

ఈ నెల 22 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాలు, చారిత్రిక కట్టడాల వద్ద పర్యాటక, సాంస్కృతిక శాఖల అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతోంది.

ఈ నెల 27న హైదరాబాద్‌ టాంక్ బండ్ మీద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహించబోతోంది. దీనిలో భాగంగా టాంక్ బండ్‌పై తెలంగాణ ఆహార పదార్ధాలు, పిండివంటలతో సహా హైదరాబాద్‌ ప్రసిద్ద వంటకాల స్టాల్స్, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. 

ఈ నెల 28న పర్యాటక శాఖ అధ్వర్యంలో హైదరాబాద్‌, నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు, మహిళా బైక్‌ రైడర్స్ సమావేశం జరుగుతుంది. 

ఈ నెల 30న సచివాలయం వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నుంచి టాంక్ బండ్‌పై బతుకమ్మ ఘాట్ వరకు వందలాది మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ ర్యాలీ చేస్తారు.

Related Post