కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో గొల్ల కురుముల జీవనోపాధి కోసం ఒక్కో కుటుంబానికి 20 గొర్రెలు చొప్పున పంపిణీ చేసింది. దానిపై పలు పిర్యాదులు రావడంతో ఏసీబీ విచారనజరిపి సుమారు రూ.750 కోట్ల వరకు అవినీతి జరిగిందని తేల్చి చెప్పింది.
అంత పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరిగినందున ఈడీ కూడా రంగప్రవేశం చేసి ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా వేరేగా మరో కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.
గొర్రెలు పొందాల్సిన లబ్దిదారులు చాలా మంది మోసపోయారు. ఏపీలో గొర్రెలు కొని వారికి అందజేయాల్సిన కొందరు అధికారులు, మొయినుద్దీన్ గ్యాంగ్‌తో కుమ్మక్కు అయ్యి సుమారు రూ.2 కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ కనుగొంది. ఆ సొమ్ముని వారి సొంత ఖాతాలలో జమా చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.
ఆ కేసు ఆధారంగా దళారులు, అధికారుల చేతిలో మోసపోయిన వారిని విచారించి వివరాలు తెలుసుకునేందుకు ఈడీ నోటీసులు పంపిస్తోంది. ఈ నెల 15న అందరూ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యి తమ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
నాడు ఈ పధకం అమలు చేస్తున్నప్పుడు రాష్ట్ర పశుసంవర్ధక, మత్సశాఖా మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కనుక ఈ కేసు అయన మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది.