థాంక్యూ కెసిఆర్: ఇవాంకా

December 19, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ కుమార్తె, అయన సలహాదారు ఇవంకా ట్రంప్ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లేఖ వ్రాశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆమె, తనను చక్కగా ఆదరించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ మంచి జ్ఞాపిక (ఛార్మినార్ బొమ్మ) ఇచ్చినందుకు లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా ప్రజల ఆదరణ, ఆతిధ్యం ఎన్నటికీ మరువలేనని మళ్ళీ మరోసారి భారత్ రావాలని కోరుకొంటున్నానని ఆ లేఖలో వ్రాశారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును తెలంగాణా ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహించి అందరికీ చాలా ప్రేరణ కలిగించిందని వ్రాశారు. 

ఇటువంటి సదస్సులలో హాజరైనవారు స్వదేశం తిరిగి వెళ్ళిన తరువాత కృతజ్ఞతలు తెలుపుతూ ఈవిధంగా లేఖలు వ్రాయడం సర్వసాధారణమైన విషయమే. అయితే అధికారులు తయారుచేసి ఇచ్చిన లేఖలపై సంతకాలు చేసి పంపించేస్తుంటారు. కానీ ఇవంకా ట్రంప్ ఆవిధంగా మొక్కుబడిగా లేఖను పంపకుండా స్వయంగా వ్రాయడం గమనిస్తే ఆమె తెలంగాణా ప్రభుత్వంతో, ఈ సదస్సుతో బాగానే ‘కనెక్ట్’ అయినట్లు భావించవచ్చు. ఈ సదస్సు నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఆతిధ్యం పట్ల ఆమె చాలా సంతృప్తి చెందినట్లు అర్ధం అవుతోంది. ఆమె పట్ల తెలంగాణా ప్రభుత్వం చూపిన ఆదరణ, సదస్సులో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం వలన ఆమెకు భారత్ పట్ల నమ్మకం, అభిమానం పెరిగాయని ఆ లేఖను చూస్తే అర్ధం అవుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం ఈవిధంగా యావత్ దేశానికి మేలు కలిగించగలడం గొప్ప విషయమే కదా!         


Related Post