సౌదీ అరేబియా సంచలన నిర్ణయం

December 12, 2017
img

సౌదీ అరేబియా ప్రభుత్వం తన రాచరికపాలనకు భిన్నంగా ఇటీవల కాలంలో సంచలన నిర్ణయాలు తీసుకొంటుండటం విశేషం. నూటికి 101 శాతం ఇస్లాం మతాచారాలను పాటించే సౌదీలో అనేక దశాబ్దాలుగా చాలా కటినమైన చట్టాలు, శిక్షలు, ఆంక్షలు, విధివిధానాలు అమలులో ఉన్నాయి. 

ఆ దేశంలో మహిళలకు ఆస్తి హక్కు లేదు. అలాగే వాహనాలను డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లేదు. మహిళలు బయటకు వెళ్ళదలిస్తే తప్పనిసరిగా ముఖం కూడా కనిపించకుండా బుర్ఖా ధరించాలి. ఇక దశాబ్దాలుగా దేశంలో సంపూర్ణ మద్యపానం అమలులో ఉంది. జూదంపై కూడా నిషేధం ఉంది. దేశంలో ఎవరూ ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీలులేదు. అలాగే దేశంలో  ఎక్కడా సినిమాలను ప్రదర్శించడానికి అనుమతి లేదు కనుక సినిమా ధియేటర్లు కూడా కనబడవు. 

దొంగతనాలు, మద్యపానం, హత్యలు, అత్యాచారాలకు పాల్పడినవారికి ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన శిక్షలు బహిరంగంగానే ప్రజల సమక్షంలోనే అమలు చేస్తుంటారు. కనుక అక్కడ నేరం చేయాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే. సౌదీ రాజకుటుంబంలో ఒక యువరాజు ఒక హత్యానేరంలో దోషిగా న్యాయస్థానం నిర్దారించడంతో అతనికీ బహిరంగంగా మరణశిక్ష అమలుచేశారంటే ఆదేశంలో చట్టాలను ఎంత ఖచ్చితంగా అమలుచేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 

అత్యంత కటినమైన ఈ విధివిధానాల వలన సౌదీ అరేబియాలో చాలా ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ, అంతర్గతంగా వీటిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కానీ రాచరిక ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేక మౌనం వహించాల్సి వస్తోంది. ఆ దేశంలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను చూసి ఆ దేశాన్ని ఒక ‘సువిశాలమైన బందీఖానా’ గా ప్రపంచదేశాలు అభివర్ణిస్తుంటాయి.    

అయితే మారుతున్న ప్రపంచంతో బాటు సౌదీ అరేబియా కూడ మారవలసిన అవసరం ఉందని భావిస్తున్న సౌదీ యువరాజు మహమ్మద్ బిన్-సల్మాన్ గత కాలంగా ఆ దేశంలో కొన్ని అనూహ్యమైన సంస్కరణలను అమలు చేస్తున్నారు. విజన్ 2030లో భాగంగా మొదటగా మహిళలకు వాహనాలు డ్రైవింగ్ చేసేందుకు అనుమతించారు. తాజాగా దేశంలో సినిమాల ప్రదర్శనపై గత 35 ఏళ్ళుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. 2018 జనవరి నుంచి దేశంలో సినీ ప్రదర్శనలకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ సమాచార శాఖామంత్రి అల్వాద్ అవాద్ ప్రకటించారు. 

సౌదీలో అనేకమంది ప్రజలు ఈ కటినమైన విధివిధానాలను వ్యతిరేకిస్తుండగా, సౌదీ యువరాజు అమలుచేస్తున్న ఈ సంస్కరణలను కూడా ఛాందసవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సౌదీఅరేబియా మెల్లగా అభ్యుదయపధంవైపు అడుగులు వేయడం ప్రారంభించిందని చెప్పవచ్చు. 

Related Post