హైదరాబాద్ చేరుకొన్న ఇవాంకా

November 28, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్నారు. భారత్ లో అమెరికా రాయబారి కెన్ జుస్టర్, అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ కేథరినా హడ్డా, అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ శరణ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున జయేష్ రంజన్, అంజనీ కుమార్, సీఐడీ ఐజీ షికా గోయెల్‌ తదితరులు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. భద్రతా కారణాల రీత్యా విస్టన్ హోటల్, మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ లో రెండు చోట్ల ఆమెకు బస ఏర్పాటు చేశారు. ఆమె కోసం అమెరికా నుంచి రప్పించిన ప్రత్యేక రక్షణ గల కారులో విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా ట్రైడెంట్ హోటల్ కు చేరుకొన్నారు.

ఆమె సాయంత్రం 3.30 గంటల వరకు విశ్రాంతి తీసుకొని 4గంటలకు హెచ్.ఐ.సి.సి.లో జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు హాజరవుతారు. ఆ తరువాత అక్కడే ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో వేర్వేరుగా భేటీ అవుతారు. ఈ సదస్సుకు హాజరవుతున్న దేశవిదేశీ అతిధుల గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి ఫలక్ నూమా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేస్తోంది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఇవాంకతో సహా అందరూ  హాజరవుతారు.

విందు ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఇవాంకా ట్రైడెంట్ హోటల్ చేరుకొని బుధవారం ఉదయం మళ్ళీ సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి నుంచే ఆమె హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో పర్యటించబోతున్నారు. భద్రతా కారణాల రీత్యా ఆమె ఏ ప్రాంతంలో పర్యటించబోతున్నారనే విషయాన్ని భద్రతాధికారులు రహస్యంగా ఉంచారు. బహుశః ముందుగా అనుకొన్నట్లుగా ఆమె చార్మినార్ ప్రాంతంలోనే పర్యటించే అవకాశం ఉందని భావించవచ్చు.

బుదవారం సాయంత్రం ఆమె హోటల్ లో అమెరికా ప్రతినిధులతో సమావేశమవుతారు. బుధవారం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ ప్రయాణం అవుతారు. 

Related Post