తెలంగాణా పారిశ్రామికవేత్త రవి పులి యువతకు సూచనలు

November 27, 2017
img

తెలంగాణా నుంచి దేశవిదేశాలకు వెళ్ళి వివిదరంగాలలో బాగా రాణించి అక్కడ స్థిరపడినవారు కోకొల్లలున్నారు. వారిలో కొందరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడగా మరికొందరు స్వయంగా పరిశ్రమలను, వాణిజ్యసంస్థలను స్థాపించి అనేకమందికి ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదిగినవారు కోకొల్లలున్నారు. అటువంటివారిలో  రవి పులి కూడా ఒకరు. ఆయన వరంగల్ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి అమెరికాకు వెళ్ళి అక్కడ స్వయంగా పరిశ్రమ స్థాపించి మంచి పేరు సంపాదించుకొన్నారు. 

రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ లో జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో అయన కూడా ఇవంకా బృందంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా యువతకు కొన్ని అమూల్యమైన సలహాలు, సూచనలు చెప్పారు. 

తెలంగాణా యువతీయువకులు చాలా ప్రతిభావంతులే అయినప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని చెప్పారు. దానికి ప్రధాన కారణం ఇంగ్లీషు బాషాపై పట్టు సాధించలేకపోవడం, ఉద్యోగాలకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోలేకపోవడం, వాటిని అందించే సాఫ్ట్-వేర్ ను ఉపయోగించుకోలేకపోవడం అని చెప్పారు. కనుక తెలంగాణా యువతీయువకులు ఈ మూడు అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. అందుకోసం తాను ఒక సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే తెలంగాణా రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తెస్తానని చెప్పారు. ఉద్యోగాలు చేయాలనుకొనేవారికి, వ్యాపారాలు లేదా పరిశ్రమలు స్థాపించాలనుకొనేవారికి వేర్వేరుగా అవసరమైన శిక్షణ ఇచ్చే విధంగా దానిని రూపొందిస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి జరుగబోయే సదస్సు ద్వారా తెలంగాణా యువతకు ఉపయోగపడే నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నానని రవి పులి అన్నారు. 

రవి పులి కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన తరువాత హైదరాబాద్ వచ్చి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని అమెరికా వెళ్ళారు. అక్కడ ఐదేళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసిన తరువాత, ఇంటర్ నేషనల్ సొల్యూషన్స్  గ్రూప్ అనే సాఫ్ట్-వేర్ సంస్థను స్థాపించారు. అది విజయవంతం అవడంతో జియోమిమి అనే మరో సంస్థను స్థాపించారు. రెండు సంస్థలలో కలిపి సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణాకు వాటిని విస్తరించాలని అయన భావిస్తున్నారు. ఐటి రంగంలో హైదరాబాద్ కు ధీటుగా ఎదుగుతున్న వరంగల్, నిజామాబాద్ వంటి ప్రాంతాలలో తమ సంస్థలను స్థాపించాలనుకొంటున్నట్లు చెప్పారు. 

Related Post