ఆ మహనీయుని స్ఫూర్తితో...

November 06, 2017
img

మన దేశం, మన రాష్ట్రం, మన మతం, మన కులం...అనే మాటలు తరచూ చాలా మందినోట వింటుంటాము. అయితే వారిలో చాలా మందికి వాటికి సంబందించిన ఏ విషయాలపై అవగాహన ఉండదు. కనీసం తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చూపరు. కానీ వాటిపై ‘పేటెంట్ హక్కులు’ పొందినట్లు మాట్లాడుతుంటారు. ఉదాహరణకు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ‘పివి నరసింహరావు ఎవరు?’ అని ప్రశ్నిస్తే కొందరు అయన ఈ దేశానికి మాజీ రాష్ట్రపతి అని చెప్పగా మరికొందరు ఆ పేరు తాము ఎన్నడూ వినలేదని సమాధానం చెప్పడం విస్మయం కలిగిస్తుంది. కానీ ఎక్కడో అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారు, మన బాష, సంస్కృతీ సంప్రదాయాలు చక్కగా పాటిస్తున్నారు. మనమందరికీ గర్వకారణమైన వివిధ రంగాలలో మన ప్రముఖుల గురించి తెలుసుకొంటున్నారు. 

అమెరికాలో తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) మరియు ‘పాఠశాల’ (ఎన్జీవో) ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత దాశరధి కృష్ణమాచార్యుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన స్వాతంత్ర పోరాటాల గురించి, ఆయన రచించిన రచనలు, కవితలు, చేసిన సినిమాల గురించి తమకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకొన్నారు. ఆయనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ప్రదర్శించి పిల్లలకు అయన గొప్పదనం గురించి వివరించారు. 

పిల్లలందరికీ అందుబాటులోకి విద్యను, ముఖ్యంగా మన తెలుగు బాషను నేర్పించాలనే తపనతో స్థాపించిన ‘పాఠశాల’ లో ఆ మహనీయుని వర్దంతిరోజునే కొత్త విద్యార్ధులను చేర్చుకొని, తరగతులు కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఎక్స్ టన్ పాఠశాల వ్యవస్థాపకులు నాగరాజు నలజుల, ఉపాద్యాయురాలు సంధ్య నందిపాటి, తానా మిడ్-అట్లాంటిక్ సభ్యులు రవి పొట్లూరి, నాగరాజు నలజుల, వేణు సంగాని, సునీల్ కోగంటి, కోటి యాగంటి, చలం పావులూరి, ఫణి కంతేటి, శ్రీకృష్ణ, రాజ్, ఫణి తదితరులు, పిల్లలు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. ‘పాఠశాల’ ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడానికి కృషి చేస్తున్న నాగరాజు నలజుల, సంధ్య నందిపాటిలను అందరూ అభినందించారు. 


Related Post