అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి

November 02, 2017
img

అమెరికాలో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు దాడులు జరిగాయి. బుధవారం ఉదయం న్యూయార్క్ నగరంలో ఒక దుండగుడు రోడ్డుపై వెళుతున్న పౌరులపైకి ట్రక్కును నడిపించి 8 మందిని పొట్టన పెట్టుకొన్నాడు. ఆ దాడిలో మరో 11 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి కొలరాడోలో వాల్ మార్ట్ సూపర్ మార్కెట్ లోకి గుర్తు తెలియని ఒక దుండగుడు ప్రవేశించి లోపల ఉన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం ధార్న్ టన్ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. సూపర్ మార్కెట్ లో లభించిన సిసి ఫుటేజ్ ల నుంచి ఆ వ్యక్తి ఫోటోలను సేకరించి మీడియాకు విడుదల చేశారు. అతను పట్టుబడితే కానీ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం తెలియదు. బహుశః ఇది కూడా అమెరికన్ గన్ కల్చర్ దుష్ప్రభావమే అయ్యుండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ ఇటీవల తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో అన్యాయంగా పౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.  


Related Post