అమెరికాలో ఖమ్మం విద్యార్ధినికి రోడ్డు ప్రమాదం

October 25, 2017
img

న్యూయార్క్ నగరంలో తెలంగాణాకు చెందిన శ్రీలేఖ అనే విద్యార్ధిని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఖమ్మం జిల్లా, మధిర మండలంలోని దెందుకూరుకు చెందిన శ్రీలేఖ బ్రింగ్యూ హంమ్ప్టన్  యూనివర్సిటీలో ఎంఎస్. చేసేందుకు ఆగస్ట్ నెలలో న్యూయార్క్ వచ్చింది.. 

ఆమె సోమవారం సాయంత్రం జాన్సన్ సిటీ ప్రాంతంలో యూనివర్సిటీ వద్ద బస్సు దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా హటాత్తుగా ఒక కారు వేగంగా దూసుకువచ్చి ఆమెను గుద్దుకొని దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు తక్షణమే ఆమెను స్థానిక విల్సన్ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అమెరికన్ ఎంబసీ అధికారులు ఆ విషయాన్నీ భారత్ ఎంబసీ అధికారులకు తెలియజేయగా వారు ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. ఆయన వెంటనే ఈ విషయాన్నీ ఆమె తల్లితండ్రులు కొల్లూరు సురేష్, సుమతిలకు తెలియజేశారు. ఈ వార్తను విన్న ఆమె తల్లితండ్రులు ఏమి చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

ఎంపి శ్రీనివాస్ రెడ్డి వారిని ఓదార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు అమెరికాలో అవసరమైన సహాయసహకారాలు అందేలాచూస్తానని హామీ ఇచ్చారు. శ్రీలేఖ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో ఇంతవరకు తెలియలేదు. శ్రీలేఖ తల్లితండ్రులు న్యూయార్క్ లో తమకు తెలిసినవారిని ఆసుపత్రికి పంపించి ఆమె పరిస్థితిని తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆమెకు సహాయం చేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమెకు సహాయపడదలచుకొన్నవారు https://www.gofundme.com/srilekha లింక్ ద్వారా యధాశక్తిన సహాయం అందించవచ్చు.


Related Post