మొదటి బాంబు ప్రయోగించే వరకు చర్చలు: అమెరికా

October 19, 2017
img

అమెరికా-ఉత్తర కొరియా దేశాల మద్య గత 3-4 నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తీవ్రం అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నాటో దేశాలతో కలిసి అమెరికా యుద్దనౌకలు మొన్న ఆదివారంనాడు స్కాట్లాండ్ సముద్రజలాలలో యాంటీ మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాయి. ఒకవేళ అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ లేదా మరే దేశంపైనైనా ఉత్తర కొరియా అణుబాంబులతో కూడిన క్షిపణిని ప్రయోగించినట్లయితే, దానిని మార్గమద్యంలోనే అడ్డుకొని కూల్చివేసే సత్తా తమకు ఉందని నిరూపించడానికే ఈ పరీక్షలు చేసినట్లు స్పష్టం అవుతోంది. 

ఇక గత కొన్ని రోజులుగా అమెరికా- దక్షిణ కొరియాలు కలిసి తమ సరిహద్దుల వద్ద నిర్వహిస్తున్న యుద్దవిన్యాసాలను ఉత్తర కొరియా గట్టిగా ఖండించింది. అది తమను యుద్ధానికి రెచ్చగొడుతున్నాయని, అందుకు అవి బారీ మూల్యం చెల్లించక తప్పదని ఉత్తర కొరియా గట్టిగా హెచ్చరించింది. అమెరికా తీరు మార్చుకోకపోతే అది ఊహించలేని విధంగా దానిని చావుదెబ్బ తీస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా రాజధాని సమీపంలో గల ఒక రహస్య ప్రాంతానికి రహస్యంగా క్షిపణులను తరలిస్తున్నట్లు అమెరికా కనుగొంది. కనుక ఉత్తర కొరియా ఏక్షణాన్నైనా మళ్ళీ క్షిపణులను ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా అమెరికా లేదా తమ మిత్రదేశాలపై మొదటి క్షిపణి ప్రయోగించనంతవరకు ఆ దేశంతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉంటాయని అమెరికా ప్రకటించింది. కనుక ఈసారి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేసినా అది యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. 

Related Post