బంతి భారత్ కోర్టులో..

October 18, 2017
img

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈరోజు భారత్ కు ఉగాది పచ్చడి వంటి తీపిచేదు కలగలిసిన మాట చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు శాశ్విత సభ్యత్వం ఇవ్వడానికి అభ్యంతరం లేదని కానీ ‘విటో పవర్’ వద్దనుకొంటేనే లభిస్తుందని చెప్పారు. 

ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న తనకు భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వం ఇవ్వాలని భారత్ చిరకాలంగా కోరుతోంది. భద్రతామండలిలో శాశ్విత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దేశాలలో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు తప్ప మిగిలిన మూడూ వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా చైనా అడ్డుపడుతోంది. భారత్ కు జర్మనీ, బ్రెజిల్,జపాన్, బ్రిక్స్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. 

కనుక ఆ షరతుకు తలొగ్గి భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వం తీసుకోవాలో వద్దో భారత్ నిర్ణయించుకోవలసి ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వం లభించడం సాధారణమైన విషయం కాదు. కానీ శాశ్విత సభ్య దేశంగా ఉంటూ ‘విటో పవర్’ లేకపోవడం వలన భారత్ వాదన ఎప్పుడూ నెగ్గే అవకాశం ఉండదు. ఒకవేళ నెగ్గే అవకాశం ఉన్నా చైనా తన విటో పవర్ తో దానిని పక్కను పెట్టించేయడం ఖాయం. కనుక భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వం భారత్ చేతికి అందీ అందనట్లు ఊరిస్తూనే ఉంది.   

Related Post