భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు : ట్రంప్

October 18, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసమైన వైట్ హౌస్ లో ఈరోజు దీపం వెలిగించి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆహ్వానించబడిన భారతీయులను ఉద్దేశ్యించి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “ఈరోజు మనమందరం కలిసి దీపావళి పండుగ జరుపుకోబోతున్నాము. ఈ పండుగ రోజున మనం వెలిగించే (దియ్యా) దీపం చెడు మీద మంచి, చీకట్ల మీద వెలుగు విజయం సాధించడానికి చిహ్నం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన భారత్ లో భారతీయులతో బాటు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ కు పైగా ఉన్న హిందువులు అందరూ శాంతి, సౌభాగ్యం కోరుతూ ఈ దీపాల పండుగ చేసుకొంటారు. భారత ప్రధాని మోడీ మాకు మంచి స్నేహితుడు. భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహ సంబంధాలు క్రమంగా ఇంకా పెరుగుతున్నాయి. వివిధ రంగాలలో గొప్ప నైపుణ్యం కలిగిన భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ రోజు మీ అందరితో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది,” అని ట్రంప్ అన్నారు. తరువాత ఆయన స్వయంగా దీపం వెలిగించి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు.     

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిపబ్లికన్ హిందూ కోయిలేషన్ అధ్యక్షుడు శలభ్ కుమార్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ కు అమెరికాలో స్థిరపడిన భారతీయుల మద్దతు కూడగట్టడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో ఆయన కూడా ట్రంప్ కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా మారారు. ఆయనతో బాటు ఐటి సర్వ్ ఎన్.జి.ఒ. సంస్థకు చెందిన సుధీర్ చక్క, కృష్ణ బన్సాల్ ఇంకా అనేకమంది ఇండో అమెరికన్ సెనేటర్స్, ప్రవాస భారతీయులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 


Related Post