సోమాలియాలో దారుణం

October 16, 2017
img

సోమాలియా అంటే ఆకలి చావులు, దారిద్ర్యం, సముద్రమార్గంలో వెళ్ళే వాణిజ్యనౌకలను హైజాక్ చేసి డబ్బు పిండుకొనే ఉగ్రమూకలు..వాటి దాడులు..అందరికీ ఇవే కళ్ళముందు మెదులుతాయి. వాటిని మరోమారు ద్రువీకరిస్తున్నట్లుగా ఆ దేశ రాజధాని మొగదిషులో శనివారం చాలా దారుణం జరిగింది. 

అల్-ఖైదాకు అనుబందంగా పనిచేస్తున్న అల్-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ మొగదిషులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని బాంబు దాడికి పాల్పడింది. చాలా శక్తివంతమైన ప్రేలుడు సామాగ్రితో నింపిన     ఒక ట్రక్కును ప్రేల్చివేయడంతో దాని ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న 231మంది చనిపోయారు. మరో 300మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రేలుడు ఎంత శక్తివంతంగా ఉందంటే దాని ధాటికి ఆ ప్రాంతంలో చాలా భవనాలు కుప్పకూలిపోయాయి. పరిసర ప్రాంతాలలో వాహనాలు, దుఖాణాలు తునాతునకలైపోయాయి. అనేక భవనాలలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ భవనాలలో శిధిలాలలో అనేకమంది చిక్కుకుపోగా అనేకమంది ఆ మంటలలో చిక్కుకొని తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ప్రేలుడు శబ్దం సుమారు 7-8 కిమీ దూరం వరకు స్పష్టంగా వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.

ఘటనా స్థలం అంతటా చెల్లాచెదురుగా పడున్న మనుషుల శవాలతో, తెగిన శరీర అవయయాలతో, ఎక్కడ చూసినా మంటలు..భాదితుల ఆర్తనాదాలతో మారుమ్రోగిపోయింది. అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క భద్రతాదళాలు, వైద్య సహాయ సిబ్బంది గాయపడినవారిని ప్రాధమిక చికిత్స అందించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సోమాలియా చరిత్రలో ఇది అత్యంత దుర్దినమని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లాహి అన్నారు. సోమాలియాలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఉగ్రమూకలను అణచివేయడానికి ఐక్యరాజ్యసమితి సహాయ, సహకారాలు కోరుతామని తెలిపారు. 


Related Post