టెక్సాస్ లో మళ్ళీ కాల్పులు!

October 10, 2017
img

అమెరికా గన్ కల్చర్ నిన్న మరోసారి బయటపడింది. ఈసారి టెక్సాస్ యూనివర్సిటీలో బయటపడింది. ఆ యూనివర్సిటీలో ఒక నేరస్తుడు దాగి ఉన్నట్లు టెక్సాస్ పోలీసులకు సమాచారం అందడంతో వారు నిన్న గాలింపు మొదలుపెట్టారు. చివరికి ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. కానీ అతను హటాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి తనను బందించిన పోలీస్ అధికారిపై కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయాడు. ఆ ఘటనలో సదరు పోలీస్ అధికారి అక్కడే చనిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

అమెరికాలో లాస్ వేగాస్ నగరంలో ఇటీవలే ఒక దుండగుడు జరిపిన కాల్పులలో 59మంది చనిపోగా మరో 200 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. కూరగాయలు అమ్మినట్లు అత్యాధునికమైన తుపాకులు కూడా అమ్ముకొనే, కొనుకొనే వెసులుబాటు అమెరికాలో ఉన్నందునే చాలా మంది ఇళ్ళలో తుపాకులు కనిపిస్తుంటాయి. నాగుపామును పట్టుకొని పెంచుకొన్నంత మాత్రాన్న అది ఎవరినీ కాటేయదనుకొంటే అవివేకమే. అమెరికాలో గన్ కల్చర్ కూడా అటువంటిదే. చేతిలో తుపాకీ ఉంటే దానిని ప్రయోగించి చూడాలనే కోరిక కలగడం సహజమే. దానివలన ఇంత ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ, మిలియన్ డాలర్ బిజినెస్ గా సాగుతున్న తుపాకీ వ్యాపారాలను ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కూడా నిషేదించలేకపోతోంది. కనుక అమెరికా ప్రజలు తమ గన్ కల్చర్ కు మూల్యం చెల్లించక తప్పడం లేదు.


Related Post