గన్ కల్చర్ కు బారీ మూల్యం చెల్లించిన అమెరికా

October 02, 2017
img

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో చాలా దారుణం జరిగిపోయింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి లాస్ వెగాస్ స్ట్రిప్ అనే ప్రాంతంలో గల మండలే బే రిసార్ట్ అండ్ కాసినో సమీపంలో గల ఒక మైదానంలో సంగీత కార్యక్రమం జరుగుతున్నప్పుడు, స్టీఫెన్ పెడ్డాక్ (64) అనే వ్యక్తి ఆ హోటల్ 32వ అంతస్తులో ఒక గదిలో నుంచి అత్యాధునిక తుపాకులను ఉపయోగించి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో 50 మంది పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో మైదానంలో సుమారు 22 వేలమంది పౌరులు ఉండటంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. ఈ సంగతి తెలియగానే భధ్రతాదళాలు అక్కడికి చేరుకొని అతికష్టం మీద ఆ దుండగుడు ఉన్న రూమ్ చేరుకొన్నారు. కానీ అపటికే అతను తుపాకీతో తనను తను కాల్చుకొని చచ్చిపడున్నాడు.

ఈ కాల్పులలో గాయపడి తప్పించుకొన్నవారు రక్తం ఓడుతున్న శరీరాలతో రోడ్లపై కూర్చొని రోదిస్తుంటే వారిని స్థానిక ప్రజలు, పోలీసులు, వైద్య సహాయ సిబ్బంది సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ సంగతి తెలిసిన వెంటనే వందలాది మంది పౌరులు ఆ ప్రాంతానికి చేరుకొని గాయపడినవారికి అవసరమైన సహాయం అందిస్తున్నారు.  గాయపడినవారికి రక్తదానం చేసేందుకు అనేక వందలమంది పౌరులు ఆసుపత్రులకు చేరుకొంటున్నారు. 

ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి స్టీఫెన్ పెడ్డాక్ (64) స్థానికుడేనని పోలీసులు గుర్తించారు. అయితే అతనికి ఎటువంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు రికార్డు లేకపోవడంతో అతను ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

సాధారణంగా ఆ స్థాయి హోటల్స్ లోకి ప్రవేశించేవారిని, వారి వాహనాలను హోటల్ భద్రతాసిబ్బంది క్షుణ్ణంగా పరీక్షించి ఎటువంటి మారణాయుధాలు లేవని దృవీకరించుకొన్న తరువాతే లోనికి అనుమతిస్తారు. కనుక ఆ దుండగుడు అంత ఆధునిక మారణాయుధంతో లోపలకు ఏవిధంగా ప్రవేశించగలిగాడనేది దర్యాప్తులో తెలియవలసి ఉంది.   

గన్ కల్చర్ కు ఇంత బారీ మూల్యం చెల్లించిన తరువాతైనా అమెరికన్ ప్రజలు దానిని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్దపడతారో లేదో చూడాలి. ఏమైనప్పటికీ ఇది అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా మిగిలిపోతుంది. 


Related Post