అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను బహుశః ఎవరూ పూర్తిగా అర్ధం చేసుకోలేరేమో? ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగలించుకొంటారు..మరోసారి వారి గురించే ఆయన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో సమావేశం అయినప్పటి నుంచి భారత్ కు చాలా అనుకూలంగా మాట్లాడుతూ, నిర్ణయాలు తీసుకొంటున్న ట్రంప్ భారత్ కు ఊహించని షాక్ ఇచ్చేరు. ప్రపంచంలో మాదకద్రవ్యాల ఉత్పత్తి, అక్రమ రవాణా చేస్తున్న 22 దేశాల పేర్లను ఆయన ప్రకటించారు. వాటిలో భారత్ పేరును కూడా చేర్చారు.
ఆ జాబితాలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మెక్సికో, కొలంబియా, వెనిజులా, బొలీవియా, కోస్టారికా, జమైకా, లావోస్, నికారగ్వా, పనామా, పెరు, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వేడార్, ఈఐ సాల్వేడర్, గౌటేమలా, హైతీ, హూండురస్, బహమాస్, బెలిజే దేశాలున్నాయి.
ఈ దేశాలలో మాదకద్రవ్యాల ఉత్పత్తిని, అక్రమ రవాణాను అరికట్టడంలో సంబంధిత అధికార యంత్రంగా విఫలమైందని కొన్ని దేశాలలో అధికారులే మాదకద్రవ్యాల సరఫరా ముఠాలతో చేతులు కలుపుతున్నట్లు తమకు సమాచారం ఉందని ట్రంప్ తెలిపారు. ఆ దేశాలలో ఆర్ధిక, భౌగోళిక పరిస్థితులు ఇందుకు ఎక్కువ దోహదపడుతున్నట్లు గుర్తించామని ట్రంప్ చెప్పారు.