హైడ్రోజన్ బాంబుతో అమెరికాకు సవాల్?

September 04, 2017
img

ఉత్తర కొరియా ఆదివారం మద్యాహ్నం విద్వంసకరమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించడంతో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో జపాన్ ను లొంగదీసేందుకు హిరోషిమా నగరంపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుతో ఆ నగరం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తర కొరియా నిన్న ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు దాని కంటే 8 రెట్లు శక్తివంతమైనది. పైగా అణుబాంబులాగే దానినీ క్షిపణికి అమర్చి ఇతరదేశాల మీద ప్రయోగించే విధంగా రూపొందించబడిందని ప్రకటించింది. ఇంతవరకు ఉత్తర కొరియా ప్రయోగించిన బాంబులలో అత్యంత శక్తివంతమైనది ఇదే. ఇంతవరకు తమ శక్తి సామర్ద్యాలపై అమెరికా, జపాన్, దక్షిణ కోరియాలకు ఉన్న అనుమానాలను ఈ హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ఉత్తర కొరియా సమాధానం చెప్పినట్లయింది. 

దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ “ఉత్తర కొరియా ఒక ధూర్త దేశం దానికి ఇక మాటలతో చెపితే అర్ధం కాదు. దానిని కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోబోతున్నాము,” అని అన్నారు. 

“ఉత్తర కొరియా చేస్తున్న ఈ పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు తమ దేశాల భద్రతకు సవాలు విసురుతున్నట్లున్నాయని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. 

“ఉత్తర కొరియా చేసిన హైడ్రోజన్ బాంబు పరీక్ష ఒక అర్ధరహితమైన వ్యూహాత్మక తప్పిదమని” దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ అన్నారు. ఉత్తర కొరియాతో సత్సంబంధాలున్న చైనా కూడా ఈ పరీక్షలను ఖండించింది. భారత్, రష్యా, ఫ్రాన్స్ ఇంకా అనేక దేశాలు ఈ పరీక్షలను ఖండించాయి.

ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు ఆ దేశంతో వ్యాపారం చేస్తున్న అన్ని దేశాలకు అమెరికాతో వ్యాపారం చేయకుండా ట్రంప్ ఆంక్షలు విదించబోతున్నట్లు తెలిపారు. అదే కనుక జరిగితే చైనాతో సహా అన్ని దేశాలు తమతో చేతులు కలిపి ఉత్తర కొరియా పై ఒత్తిడి పెంచుతాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇటువంటి పరోక్ష చర్యలతో ఉత్తర కొరియాను కట్టడిచేయడం ఆసాధ్యమేనని చెప్పక తప్పదు. 

ఉత్తర కొరియా వ్యవస్థాపక దినం సెప్టెంబర్ 9వ తేదీన దగ్గర పడుతుండటంతో మళ్ళీ ఆ రోజు అది ఏమి ప్రయోగాలు చేస్తుందోనని అమెరికాతో అన్ని దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. 

Related Post