మాజీ ప్రధాని హత్య కేసులో మాజీ దేశాధ్యక్షుడు దోషి!

August 31, 2017
img

అవును ఒక మాజీ ప్రధాని హత్య కేసులో సాక్షాత్ ఆ దేశ మాజీ దేశాధ్యక్షుడే దోషి! మరో మాజీ ప్రధాని అవినీతి ఆరోపణలలో దోషిగా కోర్టు చేత నిర్ధరింపబడి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. ఇటువంటి వింతలు విడ్డూరాలు పాకిస్తాన్ లో కాక మరెక్కడ జరుగుతాయి?

మాజీ సైన్యాధ్యక్షుడు, తరువాత పాకిస్తాన్ దేశాధ్యక్షుడుగా దేశాన్ని పాలించిన పర్వీజ్ ముషారఫ్ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్య కేసులో దోషి అని పాక్ తీవ్రవాద వ్యతిరేక ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్ లో నివసిస్తున్నారు కనుక అయన పరారీలో ఉన్నట్లు భావించి పాకిస్తాన్ లోని ఆయన ఆస్తులను జప్తు చేయవలసిందిగా న్యాయమూర్తి అస్గర్ ఖాన్ తీర్పు చెప్పారు. ఇదే కేసులో రావల్పిండి సిపిఓ సౌద్ అజీజ్ మరియు రావల్పిండి పట్టణం మాజీ ఎస్పి ఖుర్రం షాహ్ జాద్ లను న్యాయమూర్తి దోషులుగా ప్రకటించి, వారిద్దరికీ చెరో 17 ఏళ్ళు జైలు శిక్షను విదించారు. మరో ఇదురుగు వ్యక్తులను సరైన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. న్యాయమూర్తి ఇద్దరు పోలీస్ అధికారులకు శిక్షలు ప్రకటించగానే వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. 

 పాకిస్తాన్ కు రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన బెనజీర్ భుట్టో 2007, డిశంబర్ 27వ తేదీన రావల్పిండి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు ఆమెపై కొందరు బాంబులతో దాడి చేయడంతో చనిపోయారు. ఆ దాడిలో ఆమెతో బాటు మరో 20 మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఆమె హత్య కేసులో పర్వేజ్ ముషారఫ్ దోషి అని న్యాయస్థానం ప్రకటించడం పాకిస్తాన్ లో చాలా సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా నెలరోజుల క్రితమే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పనామా పేపర్స్ కుంభకోణంలో దోషి అని, అయన ఆ పదవిలో కొనసాగడానికి ఏమాత్రం అర్హుడు కాడని, ఆయన అవినీతిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని పాక్ సుప్రీంకోర్టు హోంశాఖను ఆదేశించడంతో ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు.

Related Post