డొక్లాం నుంచి భారత్ గుణపాఠం నేర్చుకోవాలి: చైనా

August 29, 2017
img

భారత్-చైనాల మద్య సిక్కిం సరిహద్దుకు సమీపంలో డొక్లాం వద్ద ఏర్పడిన ప్రతిష్టంభనను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకొన్నామని, సరిహద్దుల నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కు మళ్ళారని భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చాలా హుందాగా ఉంది. కానీ చైనా స్పందన చాలా చవకబారుగా దాని స్థాయికి తగ్గట్లుగానే ఉంది.

డొక్లాం వద్ద చైనా రోడ్డు నిర్మాణానికి పూనుకొన్నప్పుడు భారత్ గట్టిగా ప్రతిఘటించడంతో అడుగుగు ముందుకు వేయలేకపోయింది. అప్పుడు ‘భారత సైనికులు తక్షణమే వెనక్కు వెళ్ళకపోతే వారిని అక్కడి నుంచి తరిమికొడతామని’ బెదిరించింది. ‘కొండను కదిలించడం సాధ్యమేమో కానీ చైనా సైనికులను కదిలించడం అసంభవమని భారత్ తెలుసుకోవాలని’ ప్రగల్భాలు పలికింది. కానీ 70 రోజులైనా భారత్ సైనికులు వెనక్కు తగ్గలేదు. చైనా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది. 

ఈ 70 రోజుల ప్రతిష్టంభన సమయంలో చైనా మొబైల్ కంపెనీలకు నోటీసులు పంపడం, కొన్ని ఉత్పత్తులపై పన్నును పెంచడం వంటి భారత ప్రభుత్వం తీసుకొన్న కొన్ని చర్యల ద్వారా భారత్ మార్కెట్ ద్వారాలు మూసుకుపోతే ఆర్ధికంగా తాము చాలా నష్టపోతానని చైనా గ్రహించేలాగ భారత్ చేయగలిగింది.

ఈ నేపద్యంలోనే భారత్-చైనాల దౌత్యవేత్తల మద్య జరిగిన చర్చలలో ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు చైనా అంగీకరించడంతో ఇరు దేశాల సైనికులు మళ్ళీ వారివారి యధాస్థానాలకు వెళ్ళారు. అదే విషయం భారత్ చాలా సున్నితంగా చెప్పగా, చైనా మాత్రం యధాప్రకారం ప్రగల్భాలు, హెచ్చరికలు పలికి తన నీచగుణాన్ని ప్రదర్శించుకొంది. 

డొక్లాం ప్రతిష్టంభన నుంచి భారత్ గుణపాఠం నేర్చుకోవాలని సూచించింది. డొక్లాంలో మారిన పరిస్థితులు, భారత్ అభ్యర్ధన, దాని స్పందనకు అనుగుణంగా చైనా తగిన నిర్ణయం తీసుకొందని తెలిపింది. ఇరుదేశాల సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పేందుకు చైనా తన సహాకారం అందించిందని తెలిపింది. అయితే ఎట్టి పరిస్థితులలో చైనా సార్వభౌమత్వాన్ని కాపాడుకొంటుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. 

ఒకవేళ తనకు డొక్లాం వద్ద రోడ్డు నిర్మించుకొనే హక్కు ఉందని చైనా భావించి ఉండి ఉంటే అది వెనక్కు తగ్గి ఉండకూడదు. కానీ వెనక్కు తగ్గింది అంటే తనే చొరబాటుకు ప్రయత్నించినట్లు స్పష్టం అవుతోంది. అయితే తనకు ఆసియాలో ఎదురేలేదని భావిస్తున్న చైనాకు భారత్ గట్టిగా ఎదుర్కొని బుద్ధి చెప్పింది. అందుకే అది వెనక్కు తగ్గవలసి వచ్చిందని అర్ధం అవుతోంది. అయితే ఇన్ని ప్రగల్భాలు పలికి చివరికి వెనక్కు తగ్గడం వలన ప్రపంచదేశాలలో చైనా పరువుపోయింది. బహుశః దానిని కాపాడుకోనేందుకే ఈవిధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని చెప్పవచ్చు. 

పాక్ ఆక్రమిత కాశ్మీరులో సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం, మళ్ళీ ఇప్పుడు డొక్లాంలో చైనా సేనలను నిలువరించడం ద్వారా ప్రపంచదేశాలు భారత్ శక్తిని గుర్తించి ప్రశంశించేలా చేసింది. ఈ క్రెడిట్ ప్రధాని మోడీదే! 

Related Post