ఉత్తర కొరియా దుస్సాహసం...ఇక యుద్ధం తప్పదా?

August 29, 2017
img

ఉత్తర కొరియా ఈరోజు మరో దుస్సాహసానికి పూనుకొంది. మంగళవారం ఉదయం అది మరో క్షిపణి ప్రయోగం చేసింది. ఈసారి అది ప్రయోగించిన క్షిపణి జపాన్ దేశానికి చెందిన హోక్కాయ్ డో అనే ప్రాంతం మీదుగా ప్రయాణించి దానికి అవతల ఉన్న ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో పడింది. దీనితో జపాన్ ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందారు. జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాలు దీనిని యుద్దానికి కవ్వింపు చర్యగానే భావించాయి. 

ఉత్తరకొరియా కవ్వింపు చర్యలపై జపాన్ షింజో అబే స్పందిస్తూ “మా దేశభద్రతకు ముప్పుగా మారిన ఉత్తరకొరియా చేసిన ఈ క్షిపణి ప్రయోగంపై చర్చించి తగిన చర్యలు తీసుకొనేందుకు ఐక్యరాజ్యసమితి తక్షణమే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. సమితి నిర్ణయాలను, ఆదేశాలను ధిక్కరించి క్షిపణి ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియాపై తగిన చర్యలు చేపట్టవలసిన సమయం ఇదే,” అని అన్నారు.    

ఉత్తర కొరియా ఈరోజు చేసిన క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా చాలా ఆందోళన, ఆగ్రహంతో ఉంది. కనుక ఈరోజు ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద అది తన యుద్దవిమానాలతో బాంబుల వర్షం కురిపించడానికి సిద్దం అవుతోంది. అందుకు తమ దేశాధ్యక్షుడు మూన్ జె ఇన్ కొద్ది సేపటి క్రితమే తమ వాయుసేనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ కొరియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ కూడా చాలా రోజులుగా యుద్ధం కోసమే తహతహలాడుతున్నారు కనుక దక్షిణ కొరియా విసురుతున్న ఈ సవాలుకు అంతకంటే ధీటుగానే బదులివవచ్చు. అదే జరిగితే అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండదు. అప్పుడు వినాశకరమైన యుద్ధం మొదలవకమానదు. 

Related Post