కిం చేతిలో మిసైల్స్..పిచ్చోడి చేతిలో రాళ్ళు..

August 22, 2017
img

ఉత్తర కొరియా, అమెరికాల మద్య పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి. గువాం ద్వీపంపై అణ్వాయుధాలతో దాడి చేయబోతున్నామని ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఛానల్ ప్రకటించింది. అంతే కాదు..తాము గువాం ద్వీపంపై ఏవిధంగా దాడులు చేయబోతున్నామో తెలియజేస్తూ ఒక యానిమేటడ్ వీడియోను కూడా విడుదల చేసింది. దానిలో ఒకేసారి వేర్వేరు ప్రాంతాల నుంచి గువాం ద్వీపంపై క్షిపణులతో దాడి చేస్తున్నట్లు చూపించింది.

“పాపాత్ములైన అమెరికన్లకు నరకమే గతి. ఈ ప్రపంచంలో మేమే అధికులమని విర్రవీగుతూ అమెరికా మూర్ఖులు ఊహల్లో తేలిపోతున్నారు. మా హవాంగ్-14 క్షిపణి ఒక్కటి చాలు...వారి పని పట్టడానికి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమాధి అంతా శిలువలతో నిండిపోతుంది. ఆమెరికాను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా సిద్దమవుతోంది,” అని ఒక ప్రకటన కూడా జారీ చేసింది. 

వారం రోజుల క్రితమే తాము గువాం ద్వీపంపై దాడిని వాయిదా వేసుకొన్నామని ఉత్తర కొరియా ప్రకటించినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ “అది చాలా తెలివైన సరైన నిర్ణయమని కిం జాంగ్ ఉన్ ను మెచ్చుకొన్నారు. ఇక యుద్ధం ఆగిపోనట్లేనని అందరూ భావిస్తున్న సమయంలో ఉత్తర కొరియా మళ్ళీ ఈ ప్రకటన చేసింది. అమెరికా తన మానవరహిత నిఘా విమానాన్ని ఉత్తర కొరియాపైకి పంపించడమే దాని ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు. అయితే ఉత్తర కొరియా తన తాజా హెచ్చరికలో ఆ విషయం పేర్కొనలేదు. 

అయితే కిం జాంగ్ ఉన్ అమెరికాతో యుద్ధం చేయాలని చాలా తహతహలాడుతున్నారని స్పష్టం అవుతోంది. తాము హవాంగ్-14 క్షిపణులను చూసుకొని అమెరికాతో యుద్ధానికి దిగితే అమెరికా చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోదనే అతను సంగతి గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

“అమెరికా ఆయుధాలన్నీ మొహరించి ప్రయోగించడానికి సిద్దంగా ఉన్నాయి. ఉత్తర కొరియాను ఎదుర్కోవడానికి మేము అన్ని విధాల సిద్దంగా ఉన్నాము,” అని డోనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితమే ట్వీట్ చేశారు. కనుక ఉత్తర కొరియా ఈసారి గువాం లేదా అమెరికాపై క్షిపణులను ప్రయోగించబోతున్నట్లు ఏ మాత్రం అనుమానం కలిగినా అది ఉత్తర కొరియా కంటే ముందుగానే దానిపై దాడి చేసి ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయడం ఖాయం. 

కిం జాంగ్ ఉన్ చేతిలో ఉన్న అణు క్షిపణులు పిచ్చోడి చేతిలో రాళ్ళవంటివనే చెప్పక తప్పదు. కనుక వాటిని అతను ఎప్పుడు ఎవరిపై ప్రయోగిస్తారో ఎవరూ ఊహించలేరు. కానీ ప్రయోగిస్తే ముందుగా నాశనం అయ్యేది మాత్రం అతను అతని దేశమేనని భావించవచ్చు.

Related Post