స్పెయిన్ లో వరుస ఉగ్రదాడులు

August 19, 2017
img

స్పెయిన్ దేశం వరుస ఉగ్రదాడులతో తల్లడిల్లిపోతోంది. బార్సిలోనాలో దాడి జరిగిన 8గంటలలోనే శుక్రవారం మళ్ళీ మరోసారి అదే పద్దతిలో కేంబ్రిల్స్ లో దాడికి పాల్పడ్డారు. ఒక కారులో వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు దానితో రోడ్డు మీద వెళుతున్న పాదచారులను గుద్దుకొంటూ వేగంగా ముందుకు సాగారు. ఆ దాడిలో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కారులో వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు డ్రగ్స్ సేవించి మత్తులో ఉండటం వలన వారి కారు అదుపు తప్పి బోల్తా పడింది. భద్రతాదళాలు వెంటనే వారిని కాల్చి చంపాయి. ఈ దాడులకు తామే బాధ్యులమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

ఉగ్రవాదులు మొదట బాంబులతో విద్వంసం సృష్టించాలనుకొన్నారు. అల్కనార్‌ అనే పట్టణంలో వారు ఒక ఇంట్లో బాంబులు సిద్దం చేస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలిపోవడంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చుకొని రద్దీగా ఉండే ప్రాంతాలలో రోడ్లపై తిరిగే ప్రజలను వాహనాలతో తొక్కించి చంపడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారు కొంతవరకు విజయం సాధించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులలో మొత్తం 14 మంది చనిపోగా మరో 100-130 మంది వరకు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

విచారకరమైన విషయం ఏమిటంటే ఈ దాడులకు సూత్రధారి 18 ఏళ్ళు వయసున్న ఓకబీర్ అనే యువకుడు కావడం. అంత చిన్న వయసులోనే ఐసిస్ ఉగ్రవాదంవైపు ఆకర్షితుడైన ఓకబీర్ స్పెయిన్ దేశమంతటా బాంబులతో విద్వంసం సృస్టించాలనుకొన్నాడు. అతని కోసం స్పెయిన్ పోలీసులు గాలిస్తున్నారు.

Related Post