హిజ్బుల్ కు అమెరికా షాక్!

August 17, 2017
img

భారత్ ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతూ వీలు చిక్కినప్పుడల్లా దాడులు చేస్తున్న హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థకు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థను ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వాషింగ్ టన్ లో మీడియాతో మాట్లాడుతూ “అమెరికా ఇమ్మిగ్రేషన్ మరియు నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 219 ప్రకారం హిజ్బుల్ ముజాహుద్దీన్ సంస్థ విదేశీగడ్డపై ఉన్న ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాము. ఇకపై ఆ సంస్థ తన కార్యకలాపాల కోసం (ఉగ్రవాద దాడుల కోసం) నిధుల సమీకరణ చేయడానికి వీలులేదు. ఆ సంస్థతో అమెరికాలో ఎవరూ ఎటువంటి సంబంధాలు కలిగి ఉండకూడదు. దానితో ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు చేయకూడదు. అమెరికాలోని ఆ సంస్థకు చెందిన స్థిర, చార ఆస్తులను స్తంభింపజేయడమైనది. సెక్షన్ 1(బి) ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం ఆ సంస్థను స్పెషల్లీ డిజిగ్నేటడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్.డి.జి.టి.) గా ప్రకటిస్తున్నాము,” అని తెలియజేశారు.

నెలరోజుల క్రితమే అమెరికా ఆ సంస్థ అధినేత మొహమ్మద్ యూసఫ్ అలియాస్ సయ్యద్ సల్లాఉద్దీన్ ను ఎస్.డి.జి.టి.గా ప్రకటించింది. ఇప్పుడు ఆ సంస్థను కూడా ఎస్.డి.జి.టి.గా ప్రకటించడంతో దానికి మద్దతు ఇస్తున్న పాక్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

సయ్యద్ సల్లాఉద్దీన్ భారత్ లో జరిగిన పలు దాడులకు తానే బాధ్యుడినని సగర్వంగా ప్రకటించుకొంటారు. కనుక అతనిని ఉగ్రవాదిగా, దోషిగా గుర్తించడానికి వేరే ఆధారాలు అవసరం లేదు. అతనిని, అతని సంస్థపై అమెరికా ఉగ్రవాద ముద్రలు వేయడాన్ని జీర్ణించుకోలేని జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాదులు అందుకు నిరసనగా గురువారం కాశ్మీర్ బంద్ కు పిలుపునిచ్చారు. విశేషమేమిటంటే, సయ్యద్ సల్లాఉద్దీన్ నేతృత్వంలో హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ 2014 ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరిపిన బాంబు దాడులలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళి డోనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యి ఏమి సాధించారని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు దీనినే సమాధానంగా భావించవచ్చు. 

Related Post