భారతీయులకు వరంగా మారిన ఖతర్ సంక్షోభం

August 10, 2017
img

ఐసిస్ ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం అందజేస్తోందనే ఆరోపణలతో సౌదీఅరేబియాతో గల్ఫ్ దేశాలు ఖతార్ తో తెగతెంపులు చేసుకొని, దానిపై ఆంక్షలు విదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కారణంగా ఖతర్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందిప్పుడు. అయితే అది ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఇతరదేశాలతో తన సంబంధబాంధవ్యాలను బలోపేతం చేసుకొని వాటి సహాయసహకారాలు పొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే భారత్ తో సహా ప్రపంచంలో 80 దేశాల పౌరులకు తమ దేశంలో వీసా లేకుండా ప్రవేశించడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు ఆ దేశ పర్యాటక మండలి అధ్యక్షుడు హస్సన్‌ అల్‌ ఇబ్రహీం ప్రకటించారు. ఈ 80 దేశాలకు చెందిన పౌరులేవరైనా సరే ఖతార్ లో 6 నెలలపాటు ఎటువంటి వీసా లేకుండా ఉండి వెళ్ళవచ్చని ఇబ్రహీం ప్రకటించారు. అయితే తమ దేశంలో ప్రవేశించేవారు తప్పనిసరిగా తిరుగు ప్రయాణానికి టికెట్ కలిగి ఉండాలని చెప్పారు. 

ఖతర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన ఆ దేశంలో పనిచేస్తున్న 6 లక్షల మంది భారతీయులకు చాలా మేలు కలుగబోతోంది. అక్కడ చిరకాలంగా పనిచేస్తున్నవారు తమ భార్యా, పిల్లలను అక్కడకు రప్పించుకొని ఆరునెలలపాటు తమతో ఉంచుకొనేందుకు అవకాశం ఏర్పడింది. ఇంతకుముందు చాలా కటినమైన నిబంధనలు ఉన్న కారణంగా చాలా మంది భారతీయ ఉద్యోగులు తమ భార్యాపిల్లలను అక్కడికి తీసుకువెళ్ళలేకపోయేవారు. గల్ఫ్ దేశాల ఆంక్షల కారణంగా ఖతర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయులతో సహా అనేక లక్షల మంది విదేశీయులకు చాలా ఆనందం కలిగిస్తోంది. 

Related Post