ఉత్తరకొరియాతో యుద్దానికి అమెరికా సై!

August 09, 2017
img

అమెరికా-ఉత్తర కొరియా మద్య అణుయుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. అమెరికా సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఉత్తర కొరియా చేసిన తాజా ప్రకటనకు ఈసారి అమెరికా చాలా ధీటుగా బదులిచ్చింది. పసిఫిక్‌ మహాసముద్రంలోని అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపంపై ఏ క్షణమైనా అణుబాంబులతో దాడి చేస్తామని, దానిని అమెరికా అడ్డుకొనే ప్రయత్నాలు చేసినట్లయితే అమెరికాలో ప్రధాన నగరాలపై కూడా అణుబాంబులతో దాడులు చేస్తామని ఉత్తర కొరియా చేసిన తాజా ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉత్తరకొరియా పదేపదే తమపై దాడులు చేస్తామని బెదిరించడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ ఉత్తరకొరియా యుద్దానికి సాహసించినట్లయితే ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో అమెరికా విశ్వరూపం చూపిస్తుందని డోనాల్డ్ ట్రంప్ ఉత్తరాకొరియాను హెచ్చరించారు. ఈసారి ఆయన కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక యుద్దవిమానాలను గువాం ద్వీప రక్షణకు పంపించారు. అవి గువాం ద్వీపం చుట్టూ గాలిలో చక్కర్లుకొడుతూ పహారా కాస్తున్నాయి. ఈసారి ఉత్తరకొరియా ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడినా అవి ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించడానికి సంసిద్దంగా ఉన్నాయి. 

అయితే యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికా నుంచి సరిగ్గా ఇటువంటి ప్రతిస్పందన కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తూ కవ్విస్తున్నాడు. కనుక ఈసారి ఏదో ఒక సాకుతో గువాం ద్వీపంపై అణుబాంబులు వేసి అమెరికాను యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నించడం ఖాయంగానే కనిపిస్తోంది. అదేజరిగితే అమెరికా-ఉత్తరకొరియాల మద్య ప్రత్యక్షయుద్ధం జరగడం కూడా అనివార్యమే. దాని తీవ్రపరిణామాలను ఎవరూ ఊహించలేరు కూడా. 

ఉత్తరకొరియాతో చైనాకు మంచి బలమైన స్నేహసంబందాలున్నప్పటికీ అది ఈవిషయంలో పెద్దగా జోక్యం చేసుకోకపోవడం విశేషం. చైనా తీరుపట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినా చైనా చొరవ చూపకపోవడం గమనిస్తే అది కూడా అమెరికాతో యుద్దాన్నే కోరుకొంటున్నట్లు అనుమానం కలుగుతోంది. ఈ నేపద్యంలో ఉత్తరకొరియాను కట్టడి చేయగల దేశమేదీ కనబడటం లేదు కనుక యుద్ధం అనివార్యంగానే కనిపిస్తోంది. 

Related Post