అవును..విమానంలో ఆవులే ప్రయాణించాయి! ఇంతవరకు విమానాలలో ఎలుకలు, కొన్నిసార్లు పాములు వంటి చిన్న చిన్న జంతువులను పట్టుకొన్నట్లు వార్తలు చదివి ఉంటాము. కానీ మొట్టమొదటిసారిగా విమానంలో ఆవులు ప్రయాణించడం గురించి వార్త వింటున్నాము.
గల్ఫ్ దేశాలలో ఒకటైన ఖతర్ ఐసిస్ ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం అందజేస్తోందనే ఆరోపిస్తూ గల్ఫ్ లోని సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్ తదితర దేశాలు ఖతర్ పై ఆంక్షలు విధించాయి. ఆ దేశంతో దౌత్య సంబంధాలను త్రెంచుకొని జల, వాయు రవాణా వ్యవస్థలను రద్దు చేసుకొన్నాయి. ఆ కారణంగా ఖతర్ లో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ముఖ్యంగా పసిపిల్లలకు పాల కొరత ఏర్పడటంతో ఖతర్ రాజుగారు హమాద్ బిన్ ఖలీఫా అల్ తాని ఎవరూ ఊహించలేని నిర్ణయం తీసుకొన్నారు.
తమకు అండగా నిలబడిన ఇరాన్, టర్కీ, హంగేరి, మొరాకో దేశాల నుంచి ఆహార పదార్ధాలు, 4,000 పాడి ఆవులను విమానాలలో రప్పించి పాల కొరత తీర్చాలని నిర్ణయించారు. రాజుగారు తలుచుకొంటే ఆవులు కూడా విమానాలలో ఎగురుకొంటూ రాగలవని నిరూపిస్తున్నట్లుగా బుధవారం మొదటిబ్యాచ్ లో 165 ఆవులు దర్జాగా ఖతర్ ఎయిర్ లైన్స్ కార్గో విమానంలో నుంచి దిగాయి. హంగేరీలోని బుడాపెస్ట్ నుంచి ఈ ఆవులను రప్పించారు.
వాటి కోసం ముందుగానే ఏసీ సౌకర్యం ఉన్న చక్కటి వసతి, మంచి పచ్చగడ్డి, వైద్యులు, మందులు అన్ని ఏర్పాటు సిద్దం చేసి ఉంచారు ఖతర్ డెయిరీ అధికారులు. ఆగస్ట్ నెలాఖరులోగా మొత్తం 4,000 ఆవులు ఖతర్ చేరుకొంటాయని వారు చెప్పారు. వాటిని తీసుకువచ్చేందుకు కార్గో విమానాలు మళ్ళీ పంపిస్తామని చెప్పారు. ఈ 4,000 ఆవులు ఖతర్ చేరుకొంటే దేశంలో ఇప్పటికే ఉన్నవాటితో కలిపితే దేశ అవసరాలలో సుమారు 30 శాతం తీరుతుందని అన్నారు.