మోడీ అమెరికా టూర్ ఎఫెక్ట్ : హఫీజ్ పై నిషేధం

June 30, 2017
img

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా లేదా యూరోపియన్ దేశాల పర్యటనకు బయలుదేరుతుంటే చైనా, పాకిస్తాన్ లు ఆందోళన చెందుతుంటాయి. ఆయన విదేశాలలో పర్యటించిన ప్రతీసారి వాటికి ఇబ్బంది కలిగే కార్యం ఏదో చక్కబెట్టుకొని వస్తుంటారు. అందుకే అవి ఆందోళన చెందుతుంటాయి. అమెరికాకు దగ్గరయినంత మాత్రాన్న భారత్ కు ఒరిగేదేమీ లేదని చైనా అధికార పత్రిక వ్రాయడం దాని ఆందోళనకు నిదర్శనమని చెప్పవచ్చు. దాని ఆందోళనకు తగ్గట్లుగానే మోడీ పర్యటనలోనే భారత్ కు 22 అత్యాధునిక గార్డియన్ డ్రోన్లను సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించింది.

మోడీ-ట్రంప్ భేటీ తరువాత వారిరువురూ కలిసి పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మోడీ భారత్ తిరిగి వచ్చి ఇంకా 48గంటలు గడువక మునుపే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్ కు మరోసారి ఘాటుగా హెచ్చరించారు. పాక్ లో ఉగ్రవాదులను అరికట్టలేకపోతే ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి జమాత్ ఉద్ద దవా అధినేత హఫీజ్ సయీద్ పై తక్షణం చర్యలు తీసుకోవలసిందిగా హెచ్చరించారు.

ట్రంప్ హెచ్చరికలకు భయపడిన పాక్, అతని ఉగ్రవాద సంస్థకు ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చి కాశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్న తెహ్రీక్-ఇ-ఆజాదీ జమ్మూ కాశ్మీర్ సంస్థను పాక్ హోం శాఖ అధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ కౌంటర్ టెర్రరిజం అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. దీనితో కలిపి ఆ జాబితాలో మొత్తం 65 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఒక దేశంలో పెద్ద పరిశ్రమలు లేదా వ్యాపార సంస్థల జాబితా అంత పెద్దదిగా ఉన్న ఆ ఉగ్రవాద సంస్థల జాబితా చూస్తుంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఎంతగా వేళ్ళూనుకొని ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

Related Post