ఆ ఆరు ముస్లిం దేశాలకు ట్రంప్ సర్కార్ ఊరట

June 29, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో చాలా దూకుడుగా వ్యవహరించడంతో న్యాయస్థానాలు ఆయనకు బ్రేకులు వేసి కట్టడి చేశాయి. దాంతో ఆయన తన దూకుడు తగ్గించుకొని ఇప్పుడు కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నట్లు కనబడుతున్నారు. ఎటువంటి బలమైన కారణాలు చూపకుండానే దేశభద్రత దృష్ట్యా అంటూ ఆరు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించగా వాటిని అమలుకాకుండా కోర్టులు నిలిపివేశాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడా ఎదురుదెబ్బలే తగిలాయి. దానితో న్యాయనిపుణుల సలహాల మేరకు ఆ ఆంక్షలకు ట్రంప్ సర్కార్ కొన్ని సవరణలు చేయడంతో సుప్రీంకోర్టు పాక్షికంగా వాటి అమలుకు అనుమతించింది. 

ఇంతకీ ట్రంప్ సర్కార్ చేసిన ఆ సవరణలు ఏమిటంటే, ఆ ఆరు దేశాలకు చెందిన పౌరులకు అమెరికాలో తల్లితండ్రులు, భార్య,భర్త, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు వంటి దగ్గర బంధువులు ఉన్నా లేదా అమెరికాలో వ్యాపారాలు లేదా వ్యాపార సంబంధాలున్నా దేశంలోకి అనుమతించాలని నిర్ణయించింది. అమ్మమ్మలు, తాతయ్యలు, బావామరుదులు, తోడల్లుళ్ళు వంటివారిని దగ్గర బంధువులుగా పరిగణించి అనుమతించరాదని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా దేశాల కౌన్సిలేట్ కార్యాలయాలకు నేడో రేపో లేఖల ద్వారా తెలియజేయబోతోంది.

సాధారణంగా అటువంటి దగ్గర బంధువులున్నవారికి ఎప్పటి నుంచో అమెరికాకు రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ ఆరు ముస్లిం దేశాల ప్రజలకు కూడా వారికి కూడా అవే నియమనిబంధనలు విధించింది కనుక ట్రంప్ సర్కార్ తీసుకొన్న ఈ తాజా నిర్ణయం వారికి కొంత ఉపశమనం కలిగించినట్లే చెప్పవచ్చు. 

Related Post