సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఏమి సాధించారని గొప్పలు?

June 27, 2017
img

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలో ఎన్.ఆర్.ఐ.ల సమావేశంలో మాట్లాడుతూ “పాక్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పుడు ఏ ఒక్క దేశమూ భారత్ ను వేలెత్తి చూపలేదు. ఒకప్పుడు ఉగ్రవాదం గురించి మనం మాట్లాడితే అదేదో శాంతిభద్రతల సమస్యగా మాత్రమే భావించేవి. కానీ ఇప్పుడు అన్ని దేశాలు ఉగ్రవాదం బారిన పడుతున్నాయి కనుక అన్ని దేశాలకు ఉగ్రవాదం అంటే ఏమిటో..దాని ప్రభావం ఏవిధంగా ఉంటుందో అర్ధం అయ్యింది. మన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, అది కోల్పోతే ఏమవుతుందో సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా ప్రపంచదేశాలకు చూపించాము. కానీ అదే సమయంలో మన లక్ష్యాల కోసం మనం ప్రపంచ శాంతికి భంగం కలిగించమని కూడా నిరూపించాము. అందుకే ఏ ఒక్క దేశమూ కూడా సర్జికల్ స్ట్రయిక్స్ ను ఖండించలేదు...మనల్ని ప్రశ్నించలేదు. అది మన విజయమే,” అని అన్నారు. 

మోడీ చెప్పినదానిని ఎవరూ కాదనలేరు కానీ పదేపదే భారత్ లోకి చొచ్చుకొని వచ్చి కవ్విస్తున్న చైనాతో కూడా మనం అంత ధీటుగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నాము? అని ప్రశ్నించుకొంటే మన బలహీనత కూడా అర్ధం అవుతుంది. సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పటికీ పాక్ ఆగడాలకు అడ్డుకట్టవేయలేకపోయామనే అంగీకరించవలసిన సమయంలో అది ఘనకార్యం అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అది దౌత్యపరంగా సాధించిన విజయం కావచ్చు కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం దక్కనేలేదు. కాశ్మీర్ లో పాక్ రగుల్చుతున్న రావణకాష్టంలో నిత్యం మన భద్రతాదళాలు, పోలీస్ అధికారులను బలి చేసుకొంటూనే ఉన్నాము. ఒకపక్క కాశ్మీర్ లో పరిస్థితులు చేయ్యిదాటి పోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి అమెరికాలో గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

Related Post