మోడీ-ట్రంప్ ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే...

June 27, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్ దంపతులు వైట్ హౌస్ వద్ద సాదరంగా ఆహ్వానించారు. తరువాత కేబినేట్ రూమ్ లో మోడీ-ట్రంప్ సమావేశమయ్యి రక్షణ, వ్యాపార రంగంలో సహకరం, తీవ్రవాదం తదితర అంశాలపై సావధానంగా చర్చించారు. వారి చర్చల పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. అనంతరం వారిరువురూ కలిసి మీడియాతో మాట్లాడారు. 

భారత ప్రభుత్వం అమలుచేయబోతున్న జి.ఎస్.టి.గురించి ట్రంప్ ప్రస్తావించడం విశేషం. త్వరలోనే తమ దేశంలో కూడా నూతన పన్ను విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. “భారత్ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన దేశం. ఆసియాలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చిరకాలంగా భారత్ అమెరికాకు ఒక నమ్మకమైన స్నేహితుడిగా నిలబడి ఉంది. భారత్ మాకు అత్యంత ఆప్తమిత్రుడిగా భావిస్తాము. అమెరికా-భారత్ రెండు దేశాలు తీవ్రవాద ప్రభావిత దేశాలే. కనుక తీవ్రవాదం అణచివేతకు కలిసి కృషి చేస్తాము. వాణిజ్య రంగంలో పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగుతాము,” అని ట్రంప్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ, “భారత్-అమెరికా దేశాలు వ్యాపారం, రక్షణ, ఉగ్రవాద నిర్మూలనలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నాము. ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి నెలకొల్పడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఇక ముందు కొనసాగుతాయి,” అని అన్నారు. 

Related Post