పవిత్ర మక్కాపై దాడులకు విఫలయత్నం

June 24, 2017
img

అల్లా పేరిట మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులు చివరికి ముస్లింలకు అత్యంత పవిత్రమైన, పుణ్యక్షేత్రం అయిన సౌదీ అరేబియాలోని మక్కా మసీదుపైనే దాడులు చేయడానికి సిద్దపడటం విస్మయం కలిగిస్తుంది. సౌదీలోని రిజాద్, జెడ్డా నగరాలకు చెందిన ఐదుగురు తీవ్రవాదులు మక్కా మసీదులో బాంబు దాడులు చేసి విద్వంసం సృష్టించడానికి కుట్ర పన్ని మక్కాకు చేరుకొన్నారు. ఇది కనిపెట్టిన సౌదీ పోలీసులు మక్కాలో వారున్న భవనాన్ని చుట్టుముట్టి పట్టుకొనే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు బాంబు పేల్చుకొని ఆత్మాహుతి దాడి చేశాడు. ఆ దాడిలో ఐదుగురు పోలీసులతో మరో 11మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ బాంబు ప్రేలుడు ధాటికి వారున్న 5 అంతస్తుల భవనంలో మూడు అంతస్తులు బాగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఈ దాడికి సిద్దపడినవారిలో మిగిలిన నలుగురిని సౌదీ పోలీసులు ప్రాణాలతో పట్టుకొన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒక మహిళా తీవ్రవాది కూడా ఉండటం విశేషం. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

రంజాన్ పండుగ సందర్భంగా ప్రస్తుతం మక్కా దేశవిదేశాల నుంచి వచ్చిన ముస్లిం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇటువంటి సమయంలో బాంబు దాడులు జరిగి ఉండి ఉంటే అది ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవడమే కష్టం. అల్లా పేరు చెప్పుకొని మారణహోమం చేస్తున్న ఉగ్రవాదులు ఆ అల్లాకు ప్రతిరూపం అయిన మక్కాపై, ఆ అల్లా భక్తులపై పవిత్ర రంజాన్ పండుగ సమయంలోనే దాడులు చేయాలనుకోవడం చాలా దారుణం. 

Related Post