చైనాలో చాలా దారుణమైన సంఘటన జరిగింది. అభం శుభం తెలియని పసిపిల్లలున్నకిండర్ గార్డెన్ స్కూల్ ఆవరణలో బాంబు విస్పోటనం జరిగింది. ఆ ప్రేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా 58 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తూర్పు చైనాలోని క్సుజోహూలో గురువారం సాయంత్రం సుమారు 4.50 గంటలకు జరిగింది.
అంత వరకు పసిపిల్లల కేరింతలతో కళకళలాడిన ఆ ప్రాంతం ప్రేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన వారి ఆక్రందనలతో, తునాతునకలైన పిల్లల, ఆయాల శవాలతో చాలా భయానకంగా మారింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రేలుడా లేక తీవ్రవాదుల పనా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ప్రేలుడుకు కారణం ఏదైనప్పటికీ ఇది చాలా హృదయ విదారకరమైన ఘటనే.