త్వరలో ట్రంప్ తో మోడీ భేటీ

June 13, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 25,26 తేదీలలో అమెరికాలో పర్యటించబోతున్నారు. జూన్ 26న వారిరువురూ సమావేశం కాబోతున్నారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళి ఆయనను కలువబోతున్నారు కనుక వారి సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భారత్ కు హెచ్1-బి వీసాల జారీ, పాక్ తీవ్రవాదం వగైరా అంశాలపై వారి మద్య చర్చ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హెచ్1-బి వీసాల విషయంలో ట్రంప్ నుంచి మోడీ ఏమైనా హామీ రాబట్టగలిగితే భారత్ కు చాలా మేలు కలుగుతుంది.

ఇక ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ, ఆయన పర్యటనకు బయలుదేరితే పాక్ మాత్రం భయపడుతుంటుంది. ఎందుకంటే, ఆయన పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలలో ఏకాకిగా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండటమే కారణం. ఇప్పటికే పాకిస్తాన్ పట్ల ట్రంప్ తరచూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉగ్రవాదంపై పోరు కోసం అని పాక్ కు అందిస్తున్న ఆర్ధిక సహాయంలో ట్రంప్ బారీ కోత విధించారు. మోడీతో సమావేశం అయిన తరువాత ఇంకా కొత్త ఆంక్షలు ఏమైనా విదిస్తే పాక్ చాలా నష్టపోతుంది. కనుక మోడీ అమెరికా పర్యటన పాకిస్తాన్ కు సంకటంగా మారవచ్చు. కానీ ఈ పర్యటన ద్వారా భారత్ కు ఏమి మేలు కలుగబోతోందనేదే మనకు ముఖ్యం. 


Related Post