పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి

June 07, 2017
img

ఇరాన్ లో ఈరోజు ఒకే సమయంలో మూడు వేర్వేరు ప్రదేశాలలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ముగ్గురు ఉగ్రవాదులు మారణాయుధాలతో ఇరాన్ పార్లమెంటులోకి ప్రవేశించినట్లు సమాచారం. అదే సమయంలో మరొక బృందం ఇరాన్ రాజధాని తెహ్రాన్ లోని మెట్రో రైల్వే స్టేషన్ పై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంకొక ఉగ్రవాది ఇరాన్ విప్లవకారుడు ఆయతుల్లా రహుల్లా ఖోమైనీ స్మారక మందిరం వద్ద బాంబు పేల్చి ఆత్మాహుతి దాడి చేశాడు.  

పార్లమెంటులోకి చొచ్చుకుపోయిన ఉగ్రవాదులు పార్లమెంటుకు కాపలాగా ఉన్న భద్రతాదళాలపై ఏకే 47 రైఫిల్స్ తో కాల్పులు జరుపగా ఒకరు మరణించారు. పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే భద్రతాదళాలు తక్షణమే అప్రమత్తమయ్యి వారిని చుట్టుముట్టి ఎదురుదాడి చేస్తున్నాయి. పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో లోపల కొందరు ఎంపిలు ఉన్నట్లు సమాచారం. వారిలో కొంతమందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకొన్నట్లు అనధికార వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇరాన్ ప్రభుత్వం వాటిని ఇంకా దృవీకరించలేదు. ప్రస్తుతం భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మద్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఐసిస్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడి ఉంటారని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది. 


Related Post