ఖతార్ మరో ఇరాన్..సిరియా కాబోతోందా?

June 05, 2017
img

గల్ఫ్ దేశాలలో ఒకటైన ఖతార్ మరో ఇరాన్..మరో ఇరాక్..సిరియాగా మారబోతోందా..అంటే అవుననే భావించవలసి ఉంటుంది. ఉగ్రవాదులకు సహాయసహకారాలు అందిస్తున్న కారణంగా ఆ దేశంతో సౌదీ అరేబియా సంబంధాలు తెంచుకొంది. ఆ దేశంతో పంచుకొన్న సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వ అధికార వార్తా సంస్థ ప్రకటించింది. అలాగే జల, వాయు మార్గాల రవాణా మార్గాలను కూడా మూసివేస్తునట్లు ప్రకటించింది. ఇప్పటికే బహ్రేన్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవే కారణాలతో ఖతార్ తో తెగతెంపులు చేసుకొన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో సౌదీ అరేబియా కూడా చేరింది. తమ దేశాలలో ఉన్న ఖతార్ పౌరులను రెండు వారాలలోగా స్వదేశానికి తిరిగివెళ్ళిపోవాలని ఆదేశించాయి కూడా. ఖతార్ దౌత్యవేత్తలను 48 గంటలలో తమ దేశం విడిచివెళ్ళిపోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఆదేశించింది.

ఖతార్ ఉగ్రవాదులకు ఆర్ధికసహాయం అందజేయడం ద్వారా తమ దేశాలను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈవిధంగా గల్ఫ్ లో అన్ని దేశాలు ఖతార్ తో దౌత్య సంబంధాలు తెంచుకొని దానితో సరిహద్దులు మూసివేయడం వలన ఖతార్ పై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ఆ కారణంగా ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు దిగజారితే ఖతార్ కూడా మరో ఇరాన్, ఇరాక్, సిరియా, పాకిస్తాన్ లాగ ఉగ్రవాదుల కేంద్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఆ ఊబిలో కూరుకుపోతే ఇక దాని నుంచి బయటపడటం అసాధ్యమే. ఒకప్పుడు లక్షలాది భారతీయులకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపిన ఖతార్ చివరికి ఈ దుస్థితికి చేరుకోవడం చాలా బాధాకరమే.    

Related Post