కాబూల్ భారత ఎంబసీ సమీపంలో బారీ ప్రేలుడు

May 31, 2017
img

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారత్, జర్మనీ రాయబార కార్యాలయాల సమీపంలో బుధవారం మద్యాహ్నం బారీ బాంబు ప్రేలుడు జరిగింది. ఈ ప్రేలుడులో అక్కడికక్కడే 49 మంది పౌరులు చనిపోగా, మరో 300 మంది గాయపడ్డారు. అయితే రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న భారతీయులు అందరూ క్షేమంగానే ఉన్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 

ఈ బాంబు దాడి జరిగిన ప్రాంతంలో ఇంకా అనేక ఇతర దేశాల కార్యాలయాలు కూడా ఉన్నందున, ఆ ప్రాంతం అంతా ‘హై సెక్యూరిటీ జోన్’ క్రిందకు వస్తుంది. అటువంటి ప్రాంతంలో కూడా తీవ్రవాదులు ఇంత భయానకమైన దాడి చేయగలగడం విస్మయం కలిగిస్తుంది. 

ఈ బాంబు దాడిలో ఆ ప్రాంతంలో ఉన్న భారత్ తో సహా ఇతర దేశాల కార్యాలయాల కిటికీ అద్దాలు పగిలిపోయినట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడినవారు ఎవరో ఇంకా తెలియవలసి ఉంది. బహుశః ఇది తాలిబాన్ల పనే అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. 

ఈ దాడి జరిగిన వెంటనే వైద్య సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ దాడిని ఖండించారు. ఆఫ్ఘానిస్తాన్ కు భారత్ అండగా నిలబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.   

Related Post