మాంచెస్టర్ దాడికి ముందే ఉగ్ర హెచ్చరికలు?

May 23, 2017
img

సోమవారం రాత్రి మాంచెస్టర్ లో తామే దాడి జరిపామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకొంది. అగ్రరాజ్యాలు తమపై జరుపుతున్న దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు ప్రకటించారు. అయితే ఇది అంతం కాదని ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇటువంటి దాడులు ఇంకా చాలా చేయబోతున్నామని హెచ్చరించారు. 

 దాడులు జరిపిన తరువాత అది తమ పనేనని ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకోవడం మామూలే. అయితే ఈసారి మాంచెస్టర్ లో సంగీత కచేరీ జరుగబోతున్న ఎరీనా ఆడిటోరియంపై దాడులు చేయబోతున్నట్లు ఐసిస్ సానుభూతిపరుడు ఒకరు ట్వీటర్ లో ముందే ఒక మెసేజ్ పెట్టడం విశేషం. “రేపు రాత్రి నేను మాంచెస్టర్ లో జరుగబోతున్న సంగీత కచేరికి వెళ్ళి హ్యాండ్ గ్రెనేడ్ తో దాడి చేయబోతున్నాను” అని ఒకరు హెచ్చరిస్తే మరొకరు “మీరు మా హెచ్చరికలను మరిచిపోయారా? ఇది ఒక ఉగ్రవాద దాడి” అని మెసేజ్ పెట్టాడు. అయినప్పటికీ బ్రిటన్ నిఘా వర్గాలు వారి హెచ్చరికలను ముందుగా పసిగట్టలేకపోవడం వలన నిన్న రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. 

మరో విశేషం ఏమిటంటే, బ్రిటన్ లో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ చాలా చురుకుగా ఉన్నాయని, వారు ఎప్పుడైనా దాడులు చేయవచ్చని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి కూడా. కానీ వాటిని కూడా బ్రిటన్ నిఘా వర్గాలు తేలికగా తీసుకోవడం వలననే ఈ దాడి జరుగకుండా అడ్డుకోలేకపోయినట్లు అర్ధం అవుతోంది.

Related Post