అమెరికాను కవ్విస్తున్న ఉత్తర కొరియా

May 22, 2017
img

ఒకప్పుడు మన ఊరిలో మన రాష్ట్రంలో మహా అయితే..మన దేశంలో ఏమి జరుగుతోందని తెలుసుకొంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏమూల ఏ చిన్న సంఘటన జరిగిన అది మనపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపిస్తున్నందున, ఇతరదేశాలలో సమస్యల గురించి తెలుసుకోకతప్పడం లేదు.

అందుకు తాజా ఉదాహరణలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నిక, ఆయన తీసుకొంటున్న నిర్ణయాలు, తాజాగా అమెరికా- ఉత్తర కొరియా మద్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కనబడుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో భారత్ ఐటి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని పర్యవసానాలు అప్పుడే కళ్ళ ముందు కనబడటం మొదలయ్యాయి కూడా. 

తీవ్ర యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ వలన కూడా యావత్ ప్రపంచానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. అతను అమెరికాపై అణుబాంబులు వేసి నాశనం చేయాలని చాలా తహతహలాడుతున్నారు. ఒకసారి ఆ రెండు దేశాల మద్య యుద్ధం అంటూ మొదలైతే ఆ యుద్ధం..దాని తీవ్ర ప్రభావాలు కేవలం వాటికే పరిమితం కాబోవు. యావత్ ప్రపంచానికి  విస్తరించే ప్రమాదం ఉంటుంది. అందుకే అమెరికా చాలా సంయమనం పాటిస్తోంది. కానీ కిం జాంగ్ ఉన్ కు అది చేతగానితనంగా కనబడుతున్నట్లుంది. అందుకే ఆయన ఇంకా రెచ్చిపోతున్నాడు. 

అమెరికా, ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఉత్తర కొరియా ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ మరో ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది సుమారు 500 కిమీ దూరం ప్రయాణించి జపాన్ సముద్రజలాలలో పడింది. ఇంతవరకు ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులన్నీ ద్రవరూప ఇంధనం కలిగినవే. కానీ నిన్న ప్రయోగించిన దానిలో చాలా తక్కువ సమయంలో లోడ్ చేయగల ఘనరూప ఇంధనాన్ని వాడినట్లు సమాచారం. ఈ ప్రయోగాన్ని అమెరికా,  దక్షిణ కొరియా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. దీనిపై చర్చించేందుకు ఈరోజు ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం కాబోతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు.

Related Post