అమెరికాలో మరో భారతీయుడు మృతి

May 19, 2017
img

అమెరికాలో స్థిరపడిన 58ఏళ్ళ అతుల్ కుమార్ బాహుబాయ్ పటేల్ అనే ఇండో-అమెరికన్ మంగళవారం అట్లాంటా సిటీ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన అనారోగ్యం పాళీ మరణించలేదు. ఆయన ఈక్వెడర్ నుంచి ఈనెల 10న  అట్లాంటాకి వచ్చినప్పుడు, ఆయన సరైన ప్రయాణపత్రాలు చూపించనందుకు అట్లాంటా విమానాశ్రయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు అయనను అదుపులో తీసుకొని అట్లాంటా సిటీ డిటెన్షన్ సెంటరుకు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఆ వయసులో ఆయన ఆ ఒత్తిడికి తట్టుకోలేకపోవడం చేతనే గుండెపోటు వచ్చిఉండవచ్చని వేరే చెప్పనవసరం లేదు. ఆ డిటెన్షన్ సెంటరులో ఉన్నవారికి రోజువారి ఆరోగ్యపరీక్షలు నిర్వహించే ఒక నర్సు ఆయన ఆరోగ్యపరిస్థితి విషమిస్తున్న సంగతి చెప్పగానే అధికారులు ఆయనను అట్లాంటా ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయన మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్నీ అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు ఇండియన్ కౌన్సిల్ కార్యాలయానికి తెలియజేశారు. వారు అతుల్ కుమార్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 

దీనిపై అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు వివరణ ఇస్తూ, “ సాధారణంగా మా అదుపులో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకొంటుంటాము. అయినా అప్పుడప్పుడు ఇటువంటి విషాదకర సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కేవలం 8మంది మాత్రమే మా కస్టడీలో మృతి చెందారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటాము,” అని చెప్పారు. 

అతుల్ కుమార్ అమెరికాలో స్థిరపడినప్పటికీ అమెరికా అధికారులు నియమనిబంధనల పేరిట అయన పట్ల చాలా కటినంగా వ్యవహరించినట్లు అర్ధం అవుతోంది. ఎప్పుడో గానీ ఇటువంటి ఘటనలు జరుగవని చెపుతూనే మరోపక్క ఈ ఏడాదిలోనే ఇంతవరకు (5 నెలల వ్యవధిలోనే) 8మంది చనిపోయారని అధికారులు చెప్పడం గమనిస్తే వారు ఏ స్థాయిలో ప్రశ్నిస్తున్నారో, వారి అదుపులో ఉన్నవారిపై ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో ఊహించుకోవచ్చు.  ట్రంప్ వచ్చిన తరువాత అమెరికాకు ఇప్పుడు భారతీయులు గుదిబండలుగా కనబడుతున్నారు. యధారాజా తదాప్రజా అన్నట్లు అధికారులు కూడా ఆయన పద్దతిలోనే విదేశీయులను హ్యాండిల్ చేస్తున్నారని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

Related Post