తానా ఉపాధ్యక్షుడుగా తాళ్ళూరి జయశేఖర్

May 14, 2017
img

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా జరిగిన తాజా ఎన్నికలలో తాళ్ళూరి జయశేఖర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ సారి ఈ ఎన్నికలలో మొత్తం 30,497 మంది సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. కానీ గడువు తేదీ తరువాత చేరిన ఓట్లు, సాంకేతిక మరియు ఇతర కారణాలతో వాటిలో 12,907 ఓట్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 17,590 మంది వేసిన ఓట్లను లెక్కించగా వాటిలో తాళ్ళూరి జయశేఖర్ కు ఏకంగా 13,609 ఓట్లు గెలుచుకొని తన సమీప ప్రత్యర్ధి గోగినేని శ్రీనివాస్ పై విజయం సాధించారు. 

‘నేను అంటే ఒకడుగు..మనం అనుకొంటే ముందడుగు’ అనే నినాదంతో తాళ్ళూరి జయశేఖర్ పోటీ చేయగా ‘తానా నాది..నీది మన అందరిదీ’ అనే నినాదంతో గోగినేని శ్రీనివాస్ పోటీ చేశారు. 

తాళ్ళూరి జయశేఖర్ తనకంటూ ఒక ప్రత్యేకంగా ప్యానల్ ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగలేదు. ఎన్నికల ప్రచారం కోసం వివిధ నగరాలలో పర్యటించినప్పుడు అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైనవారిని, విజయావకాశాలు ఉన్నవారిని కలుపుకొని ముందుకుసాగడం ద్వారా ఈ ఎన్నికలలో విజయం సాధించగలిగారు. తాను విజయం సాధించినప్పటికీ ఈ ఎన్నికలలో పోటీ చేసిన వారందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగుతానని తాళ్ళూరి జయశేఖర్ చెప్పారు. తానాకు మరింత పేరు ప్రతిష్టలు తెచ్చేవిధంగా సేవలు, కార్యక్రమాలు నిర్వహించడమే తన లక్ష్యమని అందుకు తానా సభ్యులందరి సహకారం కావాలని తాళ్ళూరి జయశేఖర్ అన్నారు. ఈ ఎన్నికలలో తనకు ఎంతగానో సహకరించిన తన సోదరుడు, తానా శ్రేయోభిలాషి డాక్టర్ తాళ్ళూరి రాజశేఖర్ కు, తనకు సహకరించి ఓట్లు వేసి గెలిపించిన తానా సభ్యులందరికీ తాళ్ళూరి జయశేఖర్ ఈ సందర్భంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

తానా కార్యదర్శి పదవికి పోటీ పడిన లావు అంజయ్య చౌదరి 11,345 ఓట్లు గెలుచుకొని తన ప్రతర్ది భక్తాబల్ల పై  విజయం సాధించారు.

Related Post