కులభూషణ్ ఉరిశిక్ష నిలిచింది

May 10, 2017
img

బలూచిస్తాన్ లో గూడచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో కులభూషణ్ జాదవ్ అనే భారత మాజీ నేవీ అధికారికి పాక్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విదించిన సంగతి తెలిసిందే. దానిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలిపి నెదర్లాండ్స్ దేశంలో హేగ్ లో గల అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

అతను భారత ‘రా’ సంస్థ తరపున పాక్ లో గూడచర్యం చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, అతను భారత నేవీ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత ఇరాన్ లో వ్యాపారం చేసుకొంటున్నాడని, అతనితో భారత ప్రభుత్వానికి ఎటువంటి రహస్య సంబంధాలు లేవని చెప్పింది. అతనిపై పాక్ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరుపకుండా మిలటరీ కోర్టులో రహస్యంగా విచారణ జరిపి ఉరి శిక్ష వేయడం సరికాదని, అతను తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారత్ విజ్ఞప్తిపై అంతర్జాతీయ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తూ కులభూషణ్ జాదవ్ పాక్ మిలటరీ కోర్టు విదించిన ఉరి శిక్షను నిలిపివేస్తూ ‘స్టే’ ఆదేశాలు జారీ చేసింది. 

కులభూషణ్ జాదవ్ బలూచిస్తాన్ వేర్పాటువాదులకు సహకరిస్తూ పాక్ కు వ్యతిరేకంగా కుట్రలు  పన్నుతున్నాడని ఆరోపిస్తూ పాక్ మిలటరీ కోర్టు అతనికి ఉరి శిక్ష విదించింది. కానీ భారత్ వాదన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అతనిని పాక్ దళాలే ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చి బలూచిస్తాన్ లో పట్టుబడినట్లు చూపిస్తూ, భారత్ ను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వాదిస్తోంది.

ఇక మీడియాలో మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది. ఇరాన్ లోని ఒక ఉగ్రవాదుల ముఠా చేతికి కులభూషణ్ జాదవ్ చిక్కిన సంగతి తెలుసుకొన్న పాకిస్తాన్ వారికి బారీగా డబ్బు ముట్టజెప్పి అతనిని కొనుకొని బలూచిస్తాన్ తీసుకువచ్చి ఈ డ్రామా ఆడిందనే వార్త కనబడింది.

వీటిలో ఏది నిజమో తెలియదు. కానీ అతను భారత్ గూడచారి అని ఆరోపిస్తున్న పాక్ అందుకు బలమైన సాక్ష్యాధారాలు ఏవీ చూపించలేకపోవడం, న్యాయస్థానంలో విచారించకుండా మిలటరీ కోర్టులో రహస్యంగా విచారణ జరిపి ఉరి శిక్ష విదించడం అనుమానం కలుగజేస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుపై పాక్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 

Related Post