నీచ రాజకీయాలకు పరాకాష్ట

May 08, 2017
img

ఏపి రాజకీయాలపై పట్టు కోసం తెదేపా, వైకాపాల మద్య చిరకాలంగా ఆధిపత్యపోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెదేపాను దెబ్బ తీసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వైకాపా దానిని ఉపయోగించుకొనేందుకు ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడుని అక్కడే దెబ్బ తీసి, ఆయన పరువు, తెదేపా పరువు తీయాలని ప్రయత్నించి వైకాపా నవ్వులపాలయింది. 

వైకాపా మద్దతుదార్లుగా భావిస్తున్న కొందరు ‘ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్’ అనే సంస్థ పేరిట డల్లాస్ లోని ఇర్వింగ్ పట్టణ మేయరుకు ఈ-మెయిల్స్ పంపారు. “ప్రస్తుతం మీ ఇర్వింగ్ పట్టణానికి వచ్చిన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రాలో 25మంది కూలీలను ఎర్రచందనం స్మగ్లర్లనే పేరుతో హత్య చేయించారు. ఇప్పుడు మీ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా అక్కడి వారి నుంచి భారీగా నిధులు వసూలు చేస్తున్నారు. దీనిపై అవసరమైన విచారణ జరిపించగలరు,” అంటూ ఈ-మెయిల్స్ పంపారు. 

వాటిని చూసి ఇర్వింగ్ మేయర్ బెతవాన్ డ్యూన్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేయగా వారు హుటాహుటిన చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహిస్తున్న చోటుకు చేరుకొన్నారు. అక్కడ ఆయనకు ప్రవాసాంద్రులు ఘనంగా స్వాగతం పలకడం, ఆ తరువాత  ఆయనను కలవడానికి వివిధ సంస్థల సి.ఈ.ఓ.లు, అనేకమంది ప్రముఖులు రావడం చూసి తమకు తప్పుడు సమాచారం అందిందని పోలీసులు గ్రహించారు. 

ఈ విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడు తెదేపా, వైకాపాల మద్య మరో రాజకీయ యుద్ధం మొదలైంది. చంద్రబాబు నాయుడు తిరిగిరాగానే ఈ వ్యవహరంపై దర్యాప్తు జరిపించి, దీని వెనుక ఎవరెవరున్నారో కనుగొని వారిపై చర్యలు చేపడతామని తెదేపా నేతలు హెచ్చరిస్తున్నారు. జగన్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వారు అంటున్నారు. అయితే ఆ సంస్థతో, దాని ఈ-మెయిల్స్ తో వైకాపాకు ఎటువంటి సంబంధం లేదని, తమను అప్రదిష్టపాలు పాలుచేసేందుకే తెదేపా ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టిందని వైకాపా నేతలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాగూ ఒకరినొకరు విమర్శించుకొంటారు. నోరారా తిట్టుకొంటారు. కానీ విదేశాలలో కూడా ఏవిధంగా చేయడం సిగ్గుచేటు.  

Related Post