ట్రంపా..మజాకా?

May 03, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి ఇప్పటికే అందరికీ బాగా అర్ధం అయింది కనుక ఆయన గురించి కొత్తగా చెప్పుకోవలసిందేమి లేదు. కానీ ఇంతవరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న భారతీయ ఐటి సంస్థలు అయన దెబ్బకు దిగిరాక తప్పలేదు. 

ప్రముఖ భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ పై కూడా ట్రంప్-ఎఫెక్ట్ పడింది. ఆ సంస్థ తాజాగా చేసిన ఒక ప్రకటనలో రాగల రెండేళ్ళలో 10,000 మంది అమెరికన్లను ఉద్యోగాలలోకి తీసుకొంటామని ఆ సంస్థ సి.ఈ.ఓ. విశాల్ సిక్కా ప్రకటించారు. అంతే కాదు..అమెరికాలో కృత్రిమ మేధసు (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) వంటి ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన అభివృద్ధి చేయడం కోసం అమెరికాలో నాలుగు ఇన్ఫోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వాటిలో మొట్టమొదటిది ఇండియానాలో ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రారంభించబోతున్నట్లు విశాల్ సిక్కా తెలిపారు. దాని ద్వారా 2000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.  

“సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా మారుతున్నఈరోజుల్లో స్థానికుల విశ్వాసం చురగొనాలంటే తప్పకుండా స్థానిక సాంకేతిక నిపుణుల సేవలు వారి నైపుణ్యం ఉపయోగించుకోవడం చాలా అవసరం. స్థానికులు, దేశవిదేశాల నిపుణులు కలిసి పనిచేయడమే నేటి గ్లోబల్ మంత్రం,” అని విశాల్ సిక్కా అన్నారు. 

ఇన్ఫోసిస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడానికి అంతర్గత సమస్యలు, కారణాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ట్రంప్ సర్కార్ హెచ్1-బి వీసాలపై కట్టడి, అమెరికన్లకే ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకొందని అర్ధమవుతూనే ఉంది.  

ముంబైలోని ఐ.డి.బి.ఐ. క్యాపిటల్ మార్కెట్ సర్వీసస్ లిమిటెడ్ కు ఆర్ధిక నిపుణులు ఊర్మిలా షా భారత్ ఐటి కంపెనీలలో వస్తున్న ఈ మార్పులపై మాట్లాడుతూ, “అమెరికన్లను ఉద్యోగాలలోకి తీసుకొని వారికి బారీ జీతాలు ఇవ్వడం భారత్ ఐటి సంస్థలకు చాలా భారమే కావచ్చు కానీ అమెరికన్లను తీసుకోవడం వలన వాటికి స్థానిక సంస్థలనే గుర్తింపు కలుగుతుంది కనుక అక్కడ అవి విరివిగా ప్రాజెక్టులు సంపాదించుకొని ఆ లోటును భర్తీ చేసుకొనే అవకాశాలు ఉన్నాయి,” అని అన్నారు.   


Related Post