ట్రంప్ బాటలో ఆస్ట్రేలియా..

April 18, 2017
img

అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్, దానిని నిఖచ్చిగా అమలుచేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హెచ్1-బి వీసాల జారీపై మరిన్ని కటినమైన ఆంక్షలు అమలుచేసే ఉత్తర్వులపై ఆయన నేడు సంతకం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బుల్ కూడా భారతీయులు అత్యధికంగా వినియోగించుకొనే వీసా-457ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా “ఆస్ట్రేలియా ఫస్ట్” అనే విధానం అమలుచేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు.

ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ ఒక్క నిర్ణయంతోనే సుమారు లక్ష ఆస్ట్రేలియన్ వీసాలు భారత్ కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా తరువాత భారతీయులు ఎక్కువగా ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఆస్ట్రేలియానే ఎంచుకొంటుంటారు. ఇప్పుడు ఆ మార్గం కూడా మూసుకుపోబోతోంది. మొదట ట్రంప్ ఆలోచనలను, నిర్ణయాలను ప్రపంచ దేశాలు తప్పు పట్టినప్పటికీ ఇప్పుడు ఒకటొకటిగా ఆయన బాటలోనే నడిచేందుకు సిద్దపడుతుండటం విశేషం. కనుక మున్ముంది బ్రిటన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా వీసాలపై ఆంక్షలు విదించినా ఆశ్చర్యం లేదు.

కనుక విదేశాలలో ఉన్న ప్రవాసభారతీయులు, విదేశాలు వెళ్ళాలనుకొంటున్న భారతీయులు అందరూ భవిష్యత్ పరిణామాల గురించి ఒకసారి ఇప్పుడే ఆలోచించుకొని తదనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవడం మంచిది. దీపం ఉండగానే ఇళ్ళు చక్క బెట్టుకోవాలని పెద్దలన్నారు కదా అది ఇదే! 

Related Post