విజయ్ మాల్యా అరెస్ట్!

April 18, 2017
img

భారత్ లో 17బ్యాంకులకి ఏకంగా రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన మాజీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాను మంగళవారం లండన్ లో స్కాట్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అతనిపై అంతర్జాతీయ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి, అతనిని అరెస్ట్ చేసేందుకు సహకరించవలసిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అనుమతించిన బ్రిటన్ హోంశాఖ స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకొని ఈరోజు అతనిని అరెస్ట్ చేసింది. కనుక త్వరలో భారత్ అధికారులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి భారత్ తిరిగి తీసుకురావడం దాదాపు ఖాయం అయినట్లే భావించవచ్చు.

మాల్యాను అరెస్ట్ చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టిన 3గంటలలోపే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడం విశేషం. అనంతరం మాల్యా ‘ఈ కేసుపై సహజంగానే ఇండియన్ మీడియా అతి ప్రదర్శిస్తోంది. ముందు అనుకొన్నట్లుగానే నన్ను భారత్ కు అప్పగించేందుకు కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది,” అని ట్వీట్ చేశారు. అంటే తనను భారత్ రప్పించే ప్రయత్నంలో అరెస్ట్ చేయడం పెద్ద చర్చించాల్సిన విషయమేమీ కాదన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారనుకోవాలి. 

అతను గత ఏడాది మార్చిలో గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అప్పటి నుండి బ్యాంకులు, ఈడి, సుప్రీంకోర్టు, భారత ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తిరిగి వచ్చి తనపై ఉన్న కేసులను ఎదుర్కొనేందుకు రాలేదు. పైగా తనపై అన్యాయంగా కేసులు మోపి ప్రభుత్వమూ, మీడియా, బ్యాంకులు, న్యాయస్థానాలు అన్నీ కలిసి తనను మానసికంగా చాలా వేధించాయని, కనుక తాను భారత్ వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వం తలుచుకొంటే చంద్రమండలంలో దాకొన్నా పట్టి తీసుకు రావచ్చని నిరూపించింది. అతని నుంచి ఆ రూ.9000 కోట్లు వడ్డీ, జరిమానాలతో సహా వసూలు చేయడంతోనే సరిపెట్టకుండా, బ్యాంకులను మోసగించినందుకు, భారత ప్రభుత్వాన్ని, ఈడి వంటి సంస్థలని, సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించినందుకు అతనికి వేర్వేరుగా శిక్షలు విదించినప్పుడే, అటువంటి నేరాలు చేయడానికి అందరూ భయపడతారు. 

Related Post