అమెరికా రష్యా మద్య ప్రత్యక్ష యుద్ధం?

April 07, 2017
img

సిరియాలో మంగళవారం జరిగిన రసాయన దాడులలో చిన్న పిల్లలతో సహా అనేక వందల మంది మృతి చెందారు. వాటిని యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. వాటికి ప్రతీకార చర్యగా అమెరికా సిరియాపై గురువారం ఏకంగా 50 మిసైళ్ళతో బాంబుల వర్షం కురిపించింది. 

సిరియాలో గత ఆరేళ్ళుగా అంతర్యుద్దం జరుగుతోంది. ఆ దేశ అధ్యక్షుడు బసర్ అసద్ కు టర్కీ, రష్యా, ఇరాన్ మొదలైన కొన్ని దేశాలు మద్దతు ఇస్తుండగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. సిరియా ప్రభుత్వం ఐసిస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కారణంగా అగ్రరాజ్యాలు దానిని శత్రువుగా భావిస్తూ దానితో యుద్ధం చేస్తున్నాయి. ఈ నేపద్యంలో అగ్రరాజ్యాలు మద్దతు ఇస్తున్న సిరియా తిరుగుబాటుదారులను అణచివేసేందుకు, మొన్న సిరియా సేనలు రసాయన దాడులు చేయగా అమెరికా వెంటనే స్పందించి నిన్న భీకరంగా ఎదురుదాడి చేసింది. 

ఒక పక్క అగ్రరాజ్యాలు, మరోపక్క రష్యా దాని మిత్ర దేశాలు, ఇంకోపక్క ఐసిస్ ఉగ్రవాదులు పరస్పరం చేసుకొంటున్న ఈ దాడులలో అమాయకులైన సిరియా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు వేల సంఖ్యలో చనిపోతున్నారు. అనేకమంది తీవ్రంగా గాయపడి వైద్యం అందక చనిపోతున్నారు. ఈ దాడులకు భయపడి చిన్న చిన్న నౌకలలో సముద్రమార్గం గుండా పొరుగునే ఉన్న విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో మళ్ళీ అనేక వేలమంది పిల్లలు, వృద్ధులు, మహిళలు సముద్రంలో మునిగి చనిపోతూనే ఉన్నారు.

ఇంతకు ముందు కూడా సిరియాలో అమెరికా సేనలు దాడులు చేసినప్పటికీ ఇంత జోరుగా చేయలేదు. కనుక ఈ దాడులు సిరియా ప్రభుత్వానికి దానికి మద్దతు ఇస్తున్న రష్యాకు సవాలు విసిరినట్లే అవుతాయి కనుక, ఇక అమెరికా, రష్యాల మద్య ప్రత్యక్ష యుద్ధం మొదలైనా ఆశ్చర్యం లేదు. మరోపక్క ఉత్తర కొరియా కూడా క్షిపణులు ప్రయోగిస్తూ అమెరికాకు సవాలు విసురుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు కూడా చాలా దూకుడు ఎక్కువే. అందుకే సిరియాపై ఈ స్థాయిలో వెంటనే దాడులకు అనుమతించారు. కనుక ఈ యుద్దవాతావరణాన్ని తక్షణమే నియంత్రించకపోతే మూడో ప్రపంచయుద్దానికి దారి తీసే ప్రమాదం ఉంది.  

Related Post