డాలర్ డ్రీమ్స్ కు ట్రంప్ బ్రేక్స్

April 05, 2017
img

అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకొనే లక్షలాది మంది భారతీయ యువతకు హెచ్1-బి వీసా ఒక ప్రధాన మార్గం. ఆ మార్గాన్ని డోనాల్డ్ ట్రంప్ మూసివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తీసుకొన్న నిర్ణయంతో సాఫ్ట్ వేర్ నిపుణులకు ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. 

ఏటా అక్టోబర్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరం కోసం హెచ్1-బి వీసాల దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి మొదలైంది. దానికి సరిగ్గా మూడు రోజుల ముందు వీసా నిబందనలలో ట్రంప్ సర్కార్ ఒక కీలకమైన మార్పు చేసింది. దాని ప్రకారం ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ప్రత్యేక వృత్తి నిపుణుడుగా పరిగణించబడరు. అమెరికా ప్రభుత్వం 2000 సం.లో అప్పటి అవసరాల నిమిత్తం ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ ప్రోగ్రామర్ లను ప్రత్యేక వృత్తి నిపుణులుగా పరిగణించి హెచ్1-బి వీసాలు జారీ చేసింది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు కనుక వారికి హెచ్1-బి వీసాలు జారీ చేయడానికి వీలు లేదని తాజా ఆదేశాలలో పేర్కొంది. ఒకవేళ ఏవైనా సంస్థలు హెచ్1-బి వీసాల విషయంలో మోసాలకు పాల్పడితే వాటిపై కటినమైన చర్యలు తీసుకొంటామని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. 

ఈ వీసాల జారీలో అక్రమాలను గుర్తించి అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో తనికీలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన తదితర రంగాలలో అత్యున్నత స్థాయి నైపుణ్యం గల అమెరికన్లు లభ్యం కాని పక్షంలో వారిని తీసుకోవడం కోసం మాత్రమే ఈ హెచ్1-బి వీసాలను ఉపయోగించుకోవాలని, సాధారణ స్థాయి ఉద్యోగాలకు దీనిని దుర్వినియోగం చేయరాదని, చేస్తే చర్యలు తప్పవని తాజా ఆదేశాలలో పేర్కొంది. వివిద రంగాలలో నైపుణ్యం, అనుభవం ఉన్న అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు దక్కేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు స్పష్టం చేసింది.              

కనుక పాత విధానాల ప్రకారం హెచ్1-బి వీసాలతో అమెరికా వెళ్ళాలనుకొంటున్న ఐటి ఉద్యోగులకు, భారత్ ఐటి కంపెనీలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. తమకు విదేశీ ఉద్యోగులు, వారి సేవలు అవసరం లేదు అని డోనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కానీ భారతీయులే ఆయన మాటలను ఇంకా సీరియస్ గా తీసుకోవడం లేదు. కనీసం ఇకనైనా డాలర్ డ్రీమ్స్ మానుకొంటే నిరాశ తప్పుతుంది.  

Related Post